ICC Warns Pakistan: మనకు స్థాయి లేనప్పుడు.. సత్తా లేనప్పుడు.. సవాళ్లు విసరకూడదు. అలా విసిరి నవ్వుల పాలు కాకూడదు. పాకిస్తాన్ జట్టుకు ఇలా ఎన్నిసార్లు జరిగినా బుద్ధి రాదు. పైగా ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి దిగజారి నిరూపిస్తుంది. తాజాగా ఆసియా కప్ లో కూడా అలా దిగజారి ప్రవర్తించి.. పరువు తీసుకుంది పాకిస్తాన్ జట్టు. దీంతో ఆ జట్టు తీరు పట్ల అందరూ విమర్శలు చేస్తున్నారు.
విజయం సాధించిన తర్వాత టీమిండియా సారథి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పట్ల పాకిస్తాన్ ప్లేయర్లు నొచ్చుకున్నారు. దానిపై రక రకాలుగా ప్రచారం చేశారు. భారత్ పగబడుతుందని.. కావాలని ఇబ్బంది పెడుతోందనే కోణంలో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. చివరికి పాకిస్తాన్ మాజీ ఆటగాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ఉద్దేశించి అనకూడని మాటలు అన్నాడు. ఇంత జరిగినా కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి దగ్గరనుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పాకిస్తాన్ మరో అస్త్రాన్ని ఉపయోగించింది. యూఏఈ తో జరిగే మ్యాచ్ లో ఆడబోమని.. ఆసియా కప్ నుంచి వెళ్ళిపోతామని బెదిరించడం మొదలుపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో పాకిస్తాన్ అన్నంత పనీ చేస్తుందని అందరూ అనుకున్నారు. చివరికి మ్యాచ్ రిఫరీ విషయంలో కూడా పాకిస్తాన్ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసింది…
ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఐసీసీ అప్పుడు ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆసియా కప్ మీద వందల కోట్లు పెట్టుబడి పెట్టామని.. ఇప్పటికిప్పుడు టోర్నీ నుంచి వెళ్ళిపోతే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అసలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంప శయ్య మీద ఉంది. ఇలాంటి స్థితిలో పెనాల్టీ కట్టడం ఆ జట్టు మేనేజ్మెంట్ వల్ల అయ్యే పని కాదు. దీంతో చచ్చినట్టు యూఏఈ తో మ్యాచ్ ఆడింది. దానికంటే ముందు సోషల్ మీడియాలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే మాటలు మాట్లాడింది. కాకపోతే అసలు విషయం మన జాతీయ మీడియాకు తెలుసు కాబట్టి కథనాలను ప్రసారం చేసింది.