Homeక్రీడలుAsia Cup 2023: ఆసియా కప్‌ – 2023 : కేఎల్ రాహుల్‌ దూరం.. తెలుగు...

Asia Cup 2023: ఆసియా కప్‌ – 2023 : కేఎల్ రాహుల్‌ దూరం.. తెలుగు కుర్రాడికి నిరాశ.. పాకిస్తాన్‌ను ఢీకొట్టే భారత జట్టు ఇదే!

Asia Cup 2023: ఆసియా కప్‌ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌ పాకిస్తాన్, నేపాల్‌ మధ్య జరిగింది. ఇందులో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. ఇక ఈ సిరీస్‌లో భారత తొలి మ్యాచ్‌ దాయాది జట్టు పాకిస్తాన్‌తో సెప్టెంబర్‌ 2న ప్రారంభం కానుంది. ఇందుకు భారత జట్టు పూర్తిగా సిద్ధమైంది. సిరీస్‌ ప్రారంభానికి ముందే తొలి రెండు మ్యాచ్‌లకు సీనియర్‌ ఆటగాడు కేఎల్‌.రాహుల్‌ దూరమయ్యాడు. అతని స్థానంలో తెలుగు కుర్రాడిని ఎంపిక చేస్తారని భావించినా ఆ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను ఢీకొట్టే భారత జట్టులో ఎవరు ఉంటారో (అంచనా) పరిశీలిద్దాం.

వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు..
ఈ ఏడాది భారత్‌ వేదికగా జరిగే క్రికెట్‌ వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు భారత్‌ ఆసియా కప్‌ రూపంలో మరో పెద సిరీస్‌ ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో గెలిచి, ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో వరల్డ్‌ కప్‌ బరిలో దిగాలని టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేసింది. సీనియర్లు, కుర్రాళ్లతో స్ట్రాంగ్‌ టీమ్‌ తయారు చేయడానికి భారత్‌కు ఆసియా కప్‌ ఒక వేదికగా ఉపయోగపడనుంది. ఈ టోర్నీలో ఫస్ట్‌ మ్యాచ్‌ పాకిస్తాన్, నేపాల్‌ మధ్య జరిగింది. టీమిండియా తన ఫస్ట్‌ మ్యాచ్‌ను సెప్టెంబరు 2న శ్రీలంకలోని కల్లెపల్లెలో ఆడనుంది. మొదటి రెండు మ్యాచ్‌లకు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌.రాహుల్‌ అందుబాటులో ఉండడని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ స్టార్‌ బ్యాటర్‌ను ఆసియా కప్‌లో మిడిలార్డర్‌లో, ఐదో స్థానంలో బరిలోకి దింపాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. అయితే అతని గైర్హాజరీతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై కోచ్‌ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్‌ దృష్టి సారించారు.

జట్టు కూర్జు ఇలా..
– టాప్‌ ఆర్డర్‌ :
ఆసియా కప్‌లో శుభ్‌మన్‌ గిల్, రోహిత్‌శర్మ జోడీ ఓపెనింగ్‌ కాంబినేషన్‌గా బరిలోకి దిగవచ్చు. భారత్‌కు గతంలో ఈ ఓపెనింగ్‌ జోడీ గొప్ప ఫలితాలు అందించిన విషయం తెలిసిందే. దీంతో ఓపెనర్లుగా గిల్, కెప్టెన్‌ రోహిత్‌ ఆడటం పక్కా. మరో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఒకవేళ కోహ్లీ ఎప్పటిలాగే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానంలో ఆడితే, టీమ్‌లోకి తిరిగి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో స్థానంలో ఆడతాడు. అయితే రాహుల్‌ ఔట్‌ అయిన నేపథ్యంలో, వికెట్‌ కీపర్‌/బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ను ఆ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
– ఆల్‌రౌండర్లు
టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ను బలంగా మార్చడంపై దృష్టి పెట్టింది. ఇందుకు ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఆల్‌రౌండర్లుగా హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో కచ్చితంగా ఉంటారు. పిచ్‌ స్వభావాన్ని బట్టి శార్దూల్‌ ఠాకూర్‌ లేదా అక్షర్‌ పటేల్‌ మూడో ఆల్‌ రౌండర్‌గా ఎంపిక కావచ్చు.

– బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌..
బౌలింగ్‌ విషయానికి వస్తే.. మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులో కచ్చితంగా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే పాక్‌కు చెక్‌ పెట్టే బౌలింగ్‌ నైపుణ్యాలు కుల్‌దీప్‌ సొంతం. అలాగే పేస్‌ దళంలో మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా ఉంటారు. హార్దిక్‌ పాండ్యా మూడో పేసర్‌గా బౌలింగ్‌ చేస్తాడు. పరిస్థితులు అనుకూలిస్తే భారత్‌ నాలుగో పేసర్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేయవచ్చు.

భారత తుది జట్టు అంచనా..
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version