Homeక్రీడలుAsia Cup 2023 India: టీమిండియా సమస్య మళ్లీ మొదటికొచ్చిందా..?

Asia Cup 2023 India: టీమిండియా సమస్య మళ్లీ మొదటికొచ్చిందా..?

Asia Cup 2023 India: ఒకసారి దూకుడుగా ఆడేస్తారు. మరోసారి కుప్పకూలి నిరాశపరుస్తారు. ఇదీ ఆసియా కప్‌లో భారత్‌ బ్యాటింగ్‌ పరిస్థితి. లీగ్‌ దశలో పాకిస్తాన్‌పై టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా.. గౌరవప్రదమైన స్కోరు చేసింది. సూపర్‌–4లో దూకుడుగా ఆడేసి భారీ స్కోరు చేసింది. తాజాగా శ్రీలంకపై చెమటోడ్చాల్సి వచ్చింది.

ఒక్కరోజులో ఎంత తేడా..
ఒక్క రోజు ముందు జరిగిన మ్యాచ్లో భీకరమైన పేసర్లు.. దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్న చిరకాల ప్రత్యర్థిని అలవోకగా చిత్తు చేసిన టీమిండియా మరుసటి రోజు.. అదే మైదానం.. అయినా విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరిన టీమిండియాలో నిలకడలేమి ఆందోళనకు గురిచేస్తోంది. జట్టు మళ్లీ మొదటికి వచ్చిందా అన్న కలవరం అభిమానుల్లో నెలకొంది.

కొలంబోలో రెండు మ్యాచ్‌లు..
కొలంబో వేదికగా భారత్‌ వరుసగా మూడు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలుత పాకిస్తాన్‌పై 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీల హీరోలు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌తోపాటు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌ హాఫ్‌ సెంచరీలు సాధించారు. అయితే, శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం ఆరంభంలో ఉన్న దూకుడును కొనసాగించలేక భారత్‌ ఇబ్బంది పడింది.

శ్రీలంక స్పిన్‌కు తలొగ్గి..
స్పిన్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొనే భారత బ్యాట్స్‌మెన్‌లు శ్రీలంక్ల స్పిన్నర్లకు తలొగ్గారు. ఓపెనర్లు తొలి వికెట్కు 80 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లను పారేసుకున్నారు. మిడిల్లో ఇషాన్‌ కిషన్, కేఎల్‌ రాహుల్‌ కాసేపు నిలబడినా.. అది సరిపోలేదు. అప్పుడు కూడా టీమ్‌ ఇండియా వరుసగా వికెట్లను సమర్పించుకుంది. చివర్లో అక్షర్‌ పటేల్‌ కూడా ఓ

చేయి వేశాడు కాబట్టే భారత్‌ 213 పరుగులు చేయగలిగింది. స్పిన్‌ ఎదుర్కోవడంలో భారత్‌కు తిరుగులేదని అంతా భావించే వేళ యువ స్పిన్నర్లు వెల్లలాగె, అసలంక, తీక్షణలకు మొత్తం వికెట్లను సమర్పించడం గమనార్హం.

లంకేయులదీ అదే పరిస్థితి..
స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ శ్రీలంక బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు. వారి సొంత మైదానంలోనే 214 రన్స్‌ టార్గెట్‌ను ఛేదించలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి 172కే ఆలౌట్‌ అయింది.

ఆటగాళ్ల మద్య వ్యత్యాసం..
పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందని ఎక్స్‌పర్ట్స్‌ విశ్లేషిస్తున్నారు. కొందరేమో శ్రీలంక ఆటగాళ్లకు భారత్‌లోని స్టార్‌ ప్లేయర్లకు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. టీమిండియాలోని ఆటగాళ్లతో పోలిస్తే వారంతా పెద్దగా అనుభవం లేనివారే. అయినా సరే చివరి వరకూ విజయం కోసం పోరాడారు. భారత్‌ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ వారిని ఒత్తిడిలోకి నెట్టారు. లేకపోతే పరాభవం ఎదురై విమర్శలకు గురికావాల్సి వచ్చేది. అయితే, వరుసగా మ్యాచ్‌లు ఆడటం వల్ల కూడా భారత ప్రదర్శనపై ప్రభావం పడి ఉంటుందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

ఒకప్పుడు అలా..
పదేళ్ల కిందట వరకు భారత్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు విఫలమైతే.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టేవారు. అయితే, ఎంఎస్‌.ధోనీ నాయకత్వం వచ్చాక దాదాపు ఎనిమిదో వికెట్‌ వరకు బ్యాటింగ్‌ చేయడం అలవాటైంది. ఇటీవల వరకు లోయర్‌ ఆర్డర్‌ కూడా కాసిన్ని పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలుస్తోంది. మళ్లీ ఇప్పుడు ఆ పాత రోజులకు టీస్‌ఇండియా పరిస్థితి వెళ్తుందా..? అనే అనుమానం కలవరపెడుతోంది. శ్రీలంకతో జరిగి ఈ మ్యాచ్‌ చూస్తే రోహిత్‌ శర్మ (53) హాఫ్‌ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నప్పటికీ గిల్, విరాట్‌ వెనువెంటనే ఔట్‌ కావడంతో రోహిత్‌ కాన్సట్రేషన్‌ సన్నగిల్లి వికెట్ను ఇచ్చేశాడు. సరే ఇషాన్, రాహుల్‌ కుదురుకున్నారనుకునేలోపే.. వారితోపాటు హార్ధి్దక్, జడేజా కూడా వెంటనే పెవిలియన్‌కు చేరిపోయారు. పార్ట్‌ టైమ స్పిన్నర్‌ అసలంకకు కూడా నాలుగు వికెట్లను ఇవ్వడం మరింత బాధించే అంశం. పాకిస్తాన్‌ జట్టు కూడా ఇలా నిలకడలేమి ఆటతీరుతో కీలక సమయాల్లో మ్యాచ్‌లను ఓడిపోతోంది.

మెగా టోర్నీకి ముందు..
కఠిన సవాళ్లు ఎదురైతే మనం నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినట్లే అని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పినప్పటికీ.. ఆ మాటలు ఆసియా కప్‌ ఫైనల్‌ సహా మెగా టోర్నీ సందర్భంగా బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. వచ్చే ప్రపంచకప్‌లో కీలకమైన సమయంలో ఇలా వికెట్‌ పారేసుకుంటే ప్రత్యర్థులు మరింత చెలరేగే అవకాశం ఉంది. ఐసీసీ కప్‌ను నెగ్గాలనే పదేళ్ల కలపై నీళ్లు పడటం ఖాయం. అన్ని మ్యాచుచ్‌లలో నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తేనే టైటిల్‌ సాధించడం సాధ్యమవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో రాణిస్తేనే ఛాంపియన్‌గా నిలవగలం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version