Asia Cup 2023: వారి కృషివల్లే ఆసియా కప్_23 మరపురాని దృశ్యం గా మారింది

అయితే ఇటీవల ఆసియా కప్ సూపర్_4 విభాగంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఆటకు పదేపదే వర్షం అంతరాయం కలగడంతో చూసే అభిమానులు విసుగు చెందారు.

Written By: Bhaskar, Updated On : September 18, 2023 3:22 pm

Asia Cup 2023

Follow us on

Asia Cup 2023: క్రికెట్ అంటే చాలామంది ఆటగాళ్ళనే గుర్తు చేసుకుంటారు. మైదానంలో వారు ఉన్నంత సేపు ఆటనే చూస్తూ ఉంటారు. ఒకవేళ అభిమాన జట్టు ఆడుతుంటే.. అనుకోకుండా వర్షం కురిస్తే..స్టాండ్స్ లో కూర్చున్న అభిమానులు ఎక్కడా లేని విసుగు ప్రదర్శిస్తుంటారు. మైదానం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. స్టాండ్స్ లో ఉండి ఆట చూస్తున్న వారికి ఎంత ఇబ్బంది ఉంటుందో.. మైదానాన్ని తడవకుండా కాపాడటంలో సిబ్బంది కూడా అంతే ఇబ్బంది ఉంటుంది. వర్షం కురవడమే ఆలస్యం పెద్దపెద్ద టార్పాలిన్లు పట్టుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి పిచ్ పై కప్పేస్తుంటారు. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారకుండా కాపాడుతుంటారు. వర్షంలో తడుస్తూనే మైదానంలో పడిన ప్రతి చినుకును పంపించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే చాలాసార్లు వీరి శ్రమను ఎవరూ గుర్తించరు. మైదానం ఆరిపోగానే.. ఆట తిరిగి ప్రారంభం కాగానే అందరూ అందులో నిమగ్నమైపోతారు. అభిమాన ఆటగాడు ఎన్ని ఫోర్లు కొట్టాడు, ఎన్ని సిక్స్ లు బాదాడు? మెచ్చే బౌలర్ ఎన్ని వికెట్లు తీశాడు? ఎన్ని మేడ్ ఇన్ ఓవర్లు వేశాడు? ఈ గణాంకాల లెక్కింపులోనే అభిమానులు ఉంటారు.

అయితే ఇటీవల ఆసియా కప్ సూపర్_4 విభాగంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఆటకు పదేపదే వర్షం అంతరాయం కలగడంతో చూసే అభిమానులు విసుగు చెందారు. పదేపదే వర్షం కురుస్తున్న శ్రీలంక దేశానికి ఎందుకు ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వర్షం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో మైదానాన్ని కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ తడుచుకుంటూనే మైదానాన్ని చిత్తడిగా మారకుండా కాపాడారు. ఈ మ్యాచ్లో ఫలితం తేలిందీ అంటే దానికి మైదాన సిబ్బందే కారణం. వర్షం విడతలుగా కురిసినప్పటికీ వారు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్ని నిమిషాల వ్యవధిలోనే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.. అయితే కవర్లపై పడిన వాన నీటిని తొలగించడానికి వారు పాడిన శ్రమ అంతా ఇంతా కాదు. పదేపదే వారు మైదానాన్ని శుభ్రం చేసిన దృశ్యాలు చూస్తున్న ప్రేక్షకులను మాత్రమే కాదు, టీవీల్లో వీక్షిస్తున్న వారిని కూడా కలచివేశాయి.

అయితే ఇంత శ్రమ పడినప్పటికీ వారికి అందుకు తగిన విధంగా గుర్తింపు లభించదు. చాలా సందర్భాల్లో మైదాన సిబ్బంది అంతకుమించి అనేలాగా శ్రమపడినప్పటికీ అటు మేనేజ్మెంట్, ఇటు మ్యాచ్ నిర్వాహకులు ప్రతిఫలం ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు. అయితే వారికి ఎసిసి, శ్రీలంక క్రికెట్.. అండగా నిలిచాయి. క్యాండీలో పనిచేసే క్యూరేటర్లు, గ్రౌండ్ మెన్లకు భారీ నజరానా ప్రకటించాయి. 50 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 40 లక్షలు వారికి అందజేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జయ్ షా వివరాలు వెల్లడించారు. ” వారి నిబద్ధత, కృషివల్లే ఆసియా కప్ 2023 మరుపురాని దృశ్యంగా మారింది. వారికి ఎంతో కొంత తోడ్పాటు అందించేందుకు ఈ నగదు అందిస్తున్నాం. మైదానం అంత వర్షం కురుస్తున్నప్పటికీ వెంటనే అందుబాటులోకి వచ్చింది అంటే దానికి వారే కారణం. వారి శ్రమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే” అని జయ్ షా వివరించారు.