Hyderabad To Texas: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఖరీదైనది కావడంతో ఎన్నారైలు టెక్సాస్‌ను ఇష్టపడుతున్నారు. చాలా మంది ఎన్నారైలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి బదులు రెండు ప్రముఖ టెక్సాస్ నగరాలు, డల్లాస్ మరియు ఆస్టిన్‌లలో భూమిని కొనుగోలు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయమే బెటర్ అని..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భూమి కొనలేని పరిస్థితి. ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, మంత్రులు గొప్పగా చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భారీగా పెరిగిన ధరలతో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు వెనుకాడుతున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టడం కన్నా అమెరికాలో పెట్టడమే మేలనుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయం కోసం చాలా మంది ఎన్నారైలు చూస్తున్నారు. అలాంటి ప్రత్యామ్నాయం టెక్సాస్‌లో దొరికింది.
హైదరాబాద్ కన్నా పది రెట్లు తక్కువ..
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో భూముల ధరలు హైదరాబాద్ భూముల ధరలతో పోల్చితే పదింతలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర రూ.40–50 కోట్ల వరకు ఉండగా, డల్లాస్, ఆస్టిన్‌లలో కేవలం 5,00,000 నుంచి 7,00,000 డాలర్లు పలుకుతోంది. అంటే మన కరెన్సీలో ఎకరం రూ.4 నుంచి రూ.6 కోట్లకు సమానం. హైదరాబాద్‌లో ఎకరం ధరలో పదో వంతు మాత్రమే. స్టేటస్‌తోపాటు అమెరికాలోని ఆయా నగరాల్లో వాతావరణం కూడా హైదరాబాద్‌ను తలపిస్తుంది. ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. దీంతో హైదరాబాద్ కన్నా.. అమెరికానే మేలనుకుంటున్నారు తెలుగు ఎన్నారైలు. మెరికాలో ఉన్నామని, భూమి కొన్నామని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు పెద్దపెద్ద కంపెనీలు ఆస్టిన్‌కు వస్తున్నాయి. టెస్లా ప్రధాన కార్యాలయం ఇటీవల ఆస్టిన్‌కు మార్చబడింది. టయోటా ప్రధాన కార్యాలయం కూడా రాష్ట్రంలో ఉంది.
ధరలు తక్కువ.. అభివృద్ధి ఎక్కువ..
ఇక టెక్సాస్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. అదే సమయంలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి చూపడానికి బదులుగా అమెరికాలోని రాష్ట్రాల్లో భూమిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.