IND VS NZ Test Match : అద్భుతం జరగలేదు.. బెంగళూరు మరో వాంఖడే కాలేదు..కివీస్ కొట్టేసింది.. రోహిత్ సేనకు ముఖం వాచిపోయింది..

అద్భుతం జరగలేదు.. భారత బౌలర్లు చరిత్ర సృష్టించలేదు. న్యూజిలాండ్ జట్టు పెద్దగా కష్టపడలేదు. సునాయాసంగా విజయం సాధించింది. రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 1:07 pm

IND VS NZ Test Match

Follow us on

IND VS NZ Test Match :  మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ భారత జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విధించిన 107 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. 107 పరుగుల విజయ లక్ష్యంతో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. కెప్టెన్ లాథమ్(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. విల్ యంగ్ (48), రచిన్ రవీంద్ర(39), డెవాన్ కాన్వాన్(17) సత్తా చాటడంతో.. లంచ్ కు ముందే విజయ లాంచనాన్ని పూర్తి చేసింది. భారత జట్టులో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.. వాస్తవానికి 107 పరుగుల లక్ష్యం చాలా తక్కువే అయినప్పటికీ.. 2004లో వాంఖడే మైదానం వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎదుట భారత్ 107 రన్స్ టార్గెట్ ఉంచింది. అయితే ఆ పరుగులను చేదించలేక ఆస్ట్రేలియా జట్టు చతికిల పడింది. 13 పరుగులతో ఓటమిపాలైంది. నాడు భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే 107 రన్స్ టార్గెట్ విధించినప్పటికీ.. దానిని కాపాడుకోవడంలో నాటి టీమిండియా విజయవంతమైంది. 2004 నాటి మ్యాజిక్ కూడా బెంగళూరులో రిపీట్ అవుతుందని అందరూ భావించారు. పైగా బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్ వంటి బౌలర్లు ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టను ఇబ్బంది పెట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా కివీస్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేశారు.

మైదానం కాస్త తడిగా ఉండడంతో ఆదివారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంపై తేమ ఉన్న నేపథ్యంలో బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుందని.. బంతి టర్న్ అవుతుందని క్రీడా విశ్లేషకులు భావించారు. అయితే తొలి పది ఓవర్ల దాకా ఇదే సీన్ జరిగింది. కానీ ఆ తర్వాత ఎండ రావడంతో మైదానం కాస్త పొడిగా మారింది. దీంతో భారత బౌలర్లు అనుకున్నట్టుగా జరగలేదు. ఇదే సమయంలో న్యూజిలాండ్ బ్యాటర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర దూకుడు కొనసాగించడంతో.. న్యూజిలాండ్ జట్టు విజయలాంచనం పూర్తయింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో 1-0 లీడ్ లో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయాలని భావించిన టీమిండియాకు.. పరాజయంతో ఒకసారి గా విజయాల పరంపరకు బ్రేక్ పడింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసు రసవత్తరంగా మారింది. తర్వాత మ్యాచ్ లలో భారత జట్టు గెలిచిన దానినిబట్టే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు ముడిపడి ఉంటాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.