Nitish – Arundhati : తెలుగు క్రికెటర్లు నితీష్ కుమార్ రెడ్డి, అరుంధతి రెడ్డి సత్తా చాటారు. టీమిండియా విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఆదుకున్నాడు. ఆపద్బాంధవుడి లాగా అవతరించాడు. బంగ్లాదేశ్ జట్టుపై భారత పురుషుల జట్టు విజయం సాధించేలాగా తన వంతు పాత్ర పోషించాడు. ఇక టి20 మహిళా వరల్డ్ కప్ లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంకపై అద్భుతంగా బౌలింగ్ చేసి.. తెలుగు ప్లేయర్ అరుంధతి రెడ్డి 3 వికెట్లు పడగొట్టింది. జట్టు విజయంలో సహకారం అందించింది. దీంతో వీరిద్దరిపై సామాజిక మాధ్యమాలలో ప్రశంసల జల్లు కురుస్తోంది. విశ్వ వేదికలపై అద్భుతమైన ప్రదర్శన చూపించి.. తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
వారెవ్వా నితీష్ రెడ్డి
ఈ ఏడాది ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు తరుపున ఆడాడు నితీష్ రెడ్డి. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో మెరిశాడు. అదే అనుభవాన్ని బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో ఉపయోగించుకున్నాడు. కేవలం 41 పరుగుల వద్ద మూడు వికెట్లు నష్టపోయి.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు. రింకు సింగ్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించాడు. టి20 క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. 34 బంతుల్లోనే అతడు నాలుగు ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 74 రన్స్ చేశాడు. త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. రింకు సింగ్ సహాయంతో నాలుగో వికెట్ కు నితీష్ కుమార్ రెడ్డి ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. నితీష్ కుమార్ రెడ్డి చేసిన 74 పరుగులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 221 రన్స్ చేసింది.
అదరగొట్టిన అరుంధతి రెడ్డి
టి20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా శ్రీలంక జట్టుతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. టీమిండియా విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో అద్భుతమైన గెలుపును సొంతం చేసుకుంది. ఈ గెలుపులో తెలుగు క్రీడాకారిణి అరుంధతి రెడ్డి ముఖ్య పాత్ర పోషించింది. ఆమె మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించింది. అంతేకాదు ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో వరుసగా రెండుసార్లు మూడు వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డు సృష్టించింది. పాకిస్తాన్ జట్టుపై జరిగిన లీగ్ మ్యాచ్లో మూడు వికెట్లు సాధించి.. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ మూడు వికెట్లను సొంతం చేసుకుంది. శ్రీలంక ప్లేయర్లు కవిషా, నీలాక్షి, అమ కాంచన అరుంధతి రెడ్డి ధాటికి త్వరగానే పెవిలియన్ చేరుకున్నారు. వాస్తవానికి దుబాయ్ మైదానం మందకొడిగా ఉంటుంది. అలాంటి మైదానంపై బంతి నుంచి పేస్ రాబట్టడం అంత సులభం కాదు. కానీ, ఆ పనిని అరుంధతి రెడ్డి చేసి చూపించింది. అరుంధతి రెడ్డి విభిన్నమైన బంతులు వేయడంతో శ్రీలంక ప్లేయర్లు బెంబేలెత్తిపోయారు.
మొత్తంగా తెలుగు క్రికెటర్లు ఈరోజు వేర్వేరుగా జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో సత్తా చాటి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. తెలుగు జాతి ఖ్యాతిని చాటిచెప్పారు. భవిష్యత్ క్రికెట్ లో తెలుగోళ్ల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు.