IND vs SL : చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటింది. శ్రీలంక జట్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆసియా కప్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకొంది. టి20 వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. టీమిండియాలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (52*), స్మృతి మందాన (50), షఫాలి వర్మ (43) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 172 రన్స్ చేసింది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆమె మెడ గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత వెంటనే కోలుకొని.. తన తిరుగులేని ఫామ్ ప్రదర్శించింది.. మందకొడి మైదానంపై టీమిండియా ప్లేయర్లు వీరోచితంగా బ్యాటింగ్ చేయడంతో పరుగుల వరద పారింది.. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించింది. అయినప్పటికీ భారత ప్లేయర్లు తమ దూకుడు తగ్గించలేదు.
బెంబేలెత్తిపోయింది
భారీ తేడాతో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసింది. భారత బౌలర్లలో ఆశా శోభన, అరుంధతి రెడ్డి చెరో మూడు వికెట్లు సాధించారు. రేణుకా ఠాకూర్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్ ఒక వికెట్ దక్కించుకుంది. భారత్ విధించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని చేజ్ చేయడంలో శ్రీలంక జట్టు ఏ దశలోనూ పోరాటాన్ని ప్రదర్శించలేదు. ఓపెనర్ విష్మి గుణ రత్నే (0) పరుగులకు అవుట్ అయింది. కెప్టెన్ చమరి ఆటపట్టు ఒక పరుగు మాత్రమే చేసి శ్రేయాంక పాటిల్ బౌలింగ్లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. హర్షిత సమరవిక్రమ రేణుక సింగ్ బౌలింగ్లో అవుట్ అయింది. శ్రీలంక బాటర్లలో కవిశ(21), అనుష్క (20) టాప్ స్కోరర్లు గా నిలిచారు. అమ కాంచన (18) చివర్లో కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించింది. ఇక చివర్లో దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకోవడంతో.. శ్రీలంక ఇన్నింగ్స్ 19.5 ఓవర్లలో 90 పరుగుల వద్ద ముగిసింది. మొత్తంగా 82 పరుగుల తేడాతో భారత్ శ్రీలంక పై విజయం సాధించింది. ఈ విజయం ద్వారా టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.