Arshdeep Singh: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. భారత్ 2-1 తేడాతో లీడ్ లో ఉంది. ముఖ్యంగా మూడో మ్యాచ్ లో తిలక్ వర్మ 107 పరుగులు చేసి సత్తా చాటగా.. అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు జాన్సన్ విధులు సృష్టించాడు. 17 బంతుల్లోనే 54 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా వేసిన 19 ఓవర్లో ఏకంగా 26 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్స్ లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఈ దశలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అర్ష్ దీప్ సింగ్ కు 20 ఓవర్ బౌలింగ్ బాధ్యతలు అప్పగించాడు. రెండో టి20లో అర్ష్ దీప్ సింగ్ ధారాళంగా పరుగులు ఇచ్చిన నేపథ్యంలో.. సూర్య కుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక మూడో మ్యాచ్ లోనూ చివరి ఓవర్ అర్ష్ దీప్ సింగ్ కు ఇవ్వడం పట్ల సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాన్ని కామెంట్రీ బాక్స్ లో ఉన్న వ్యాఖ్యతలు తప్పు పట్టారు. అయితే ఆ నిర్ణయం సరైనదేనని అర్ష్ దీప్ సింగ్ నిరూపించాడు. ప్రమాదకరమైన జాన్సన్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఔట్ చేశాడు. ఫలితంగా టీమిండియా విజయం సాధించింది. మూడవ టి20 మ్యాచ్లో టీమ్ ఇండియా సాధించిన విజయంలో సగం బాధ్యత బ్యాటింగ్ ద్వారా తిలక్ వర్మ నెరవేర్చితే.. మిగతా బాధ్యతను అర్ష్ దీప్ సింగ్ పూర్తి చేశాడు. తద్వారా టీమిండియా ఉత్కంఠ పరిస్థితుల్లో.. 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్లో అర్ష్ దీప్ సింగ్ ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. టీమిండియా స్పిన్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వేళ అతడు ఈ వికెట్లు సాధించడం ఒకరకంగా గొప్పే అనుకోవచ్చు. అయితే ఈ ఐదు వికెట్లు సాధించడం ద్వారా అర్ష్ దీప్ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
రెండవ బౌలర్ గా
అంతర్జాతీయ టి20 క్రికెట్లో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా యజువేంద్ర చాహల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతడు 80 మ్యాచ్లలో 96 వికెట్లు పడగొట్టాడు.. ఆ తర్వాత స్థానంలో అర్ష్ దీప్ సింగ్ కొనసాగుతున్నాడు. అతడు 59 మ్యాచ్లలో 92 వికెట్లు సాధించాడు. బుధవారం దక్షిణాఫ్రికా తో జరిగిన మూడవ టి20 మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా అర్ష్ దీప్ సింగ్ భువనేశ్వర్ కుమార్ రికార్డును బద్దలు కొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు 87 మ్యాచులు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. నాలుగో స్థానంలో బుమ్రా కొనసాగుతున్నాడు. ఇతడు 70 మ్యాచ్లలో 89 వికెట్లు సాధించాడు. ఇక ఐదవ స్థానంలో హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. ఇతడు 18 మ్యాచ్లలో 88 వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ సింగ్ ఇటీవలి టి20 వరల్డ్ కప్ లోనూ అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. వెస్టిండీస్ మైదానాలపై అద్భుతమైన పేస్ రాబడుతూ వికెట్లు పడగొట్టాడు.. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్లో రెండవ టీ20 మ్యాచ్ మినహా మిగతా రెండు మ్యాచ్లలో అర్ష్ దీప్ సింగ్ తన బౌలింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు.