Arjun Erigaisi : విశ్వనాథన్ ఆనంద్ ELO(ఎలో రేటింగ్ సిస్టం) రేటింగ్ లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే ఇప్పుడు అతడి తర్వాత స్థానాన్ని అర్జున్ ఎరిగైసి అనే భారతీయుడు ఆక్రమించాడు. వాస్తవానికి ఆనంద్ తర్వాత స్థానాన్ని గుకేష్ అధిరోహిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అర్జున్ తారాజువ్వలాగా దూసుకు వచ్చి ఆస్థానాన్ని ఆక్రమించాడు. ప్రపంచ వ్యాప్తంగా నాల్గవ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అర్జున్ ఏకంగా 2,800 ఈఎల్వో రేటింగ్ సాధించాడు. గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన అర్జున్.. ఆనంద్ తర్వాత స్థానాన్ని ఆక్రమించి.. గ్రాండ్ మాస్టర్ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 16వ స్థానంలో నిలిచాడు. 2,800 గోల్డ్ స్టాండర్డ్ ఈఎల్వో ర్యాంకు సాధించాడు. తాజా ర్యాంకింగ్ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.. చెస్ ఒలంపియాడ్ లో పాల్గొన్న అర్జున్.. స్వర్ణం సాధించాడు. 21 సంవత్సరాల ఈ యువకుడు క్లాసికల్ చెస్ రేటింగ్స్ లో సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తున్నాడు.. క్లాసికల్ చెస్ విభాగంలో 2800 ఎలో రేటింగ్స్ అధిగమించి.. 16వ ఆటగాడిగా నిలిచాడు.. ఇదే విషయాన్ని FIDE ప్రపంచ గవర్నింగ్ బాడీ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొంది..” అర్జున్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా ఆవిర్భవించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ సరసన నిలిచాడు. ఈ ఏడాది డిసెంబర్ నెల నాటికి #FIDE rating జాబితాలో అతడు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అతడు 21 స్థానంలో ఉన్నాడు. 45వ చెస్ ఒలంపియాడ్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. మొత్తంగా తన సత్తాను చాటాడని” FIDE గవర్నింగ్ బాడీ ట్విట్టర్లో పేర్కొంది.
తెలంగాణ బిడ్డ..
అర్జున్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జన్మించాడు. 14 సంవత్సరాల 11 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో అతడు భారతదేశం తరఫున అగ్రశ్రేణి ఆటగాడిగా ఆవిర్భవించాడు. ప్రస్తుతం అతడి రేటింగ్ 2,801. అమెరికాకు చెందిన హికారు నకమూరా 2,802, నార్వే ప్రాంతానికి చెందిన మాగ్నస్ కార్ల్ సన్ 2,831 రేటింగ్స్ తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికాకు చెందిన ఫాబియానో కరువానా 2805 రేటింగ్ తో తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ టోర్నీలో విజేతగా నిలిచిన 18 సంవత్సరాల గుకేష్ 2783 రేటింగ్ వద్ద ఉండగా.. ప్రపంచ చెస్ ఛాంపియన్ రన్నరప్ లిరెన్ 2,728 పాయింట్లతో 22వ స్థానంలో ఉన్నాడు. అర్జున్ తన కెరీర్లో అత్యుత్తమ స్థానంలో ఉండగా.. ఇదే జోరు కనుక అతడు కొనసాగిస్తే విశ్వనాథన్ ఆనంద్ స్థాపించిన రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చదరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.