Team India jersey sponsor: డ్రీమ్ -11 కథ ముగిసిన తర్వాత టీమ్ ఇండియాకు అధికారికంగా ప్రయోజక కర్తగా వ్యవహరించే సంస్థ ఏది.. అనే ప్రశ్న కొద్ది రోజులుగా క్రికెట్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రస్తుత ఆసియా కప్ లో భారత్ స్పాన్సర్ లేకుండానే పోటీలోకి దిగింది. భారత జట్టు ధరించే జెర్సీలో స్పాన్సర్ పేరు లేకుండానే రంగంలోకి దిగడం ఇదే తొలిసారి.
డ్రీమ్ -11 తర్వాత టీమిండియా కు ఏ కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది? ఏ కంపెనీకి ఆ హక్కులు దక్కాయి? ఎంత చెల్లించబోతుంది? అనే ప్రశ్నలు నిన్నటి వరకు వినిపించాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు టీమిండియా మేనేజ్మెంట్ సమాధానం చెప్పింది. భారత క్రికెట్ జట్టుకు మనదేశంలో దిగ్గజ టైర్ల తయారీ సంస్థ అపోలో జెర్సీ స్పాన్సర్ గా ఖరారైంది. 2028 వరకు భారత్ ఆడే మ్యాచ్ లకు జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ వ్యవహరిస్తుంది. దీనికిగాను ఒక మ్యాచ్ కు 4.50 కోట్లను అపోలో టైర్స్ చెల్లిస్తుంది. అపోలో టైర్స్ సంస్థ మనదేశంలో టైర్ల తయారీలో అతిపెద్ద కంపెనీగా ఉంది. ఎంఆర్ఎఫ్ ను బలంగా ఢీకొట్టడానికి ఈ సంస్థ ఏకంగా ఈ ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. టీమిండియా కు అధికారిక ప్రయోజక కర్తగా ఉంటూ.. ఎంఆర్ఎఫ్ ను అధిగమించాలని భావిస్తోంది. గతంలో స్పాన్సర్ గా ఉండే సంస్థలు ఒప్పందం కుదుర్చుకునేవి. అన్ని సంవత్సరాల సంబంధించి కోట్లల్లో ఒప్పందం కుదుర్చుకొని చెల్లించేవి. కానీ ఇప్పుడు అపోలో టైర్స్ మాత్రం మ్యాచ్ చొప్పున డబ్బులు చెల్లిస్తోంది. టి20, వన్డే ఫార్మాట్ మాత్రమే కాకుండా టెస్టుల్లో కూడా టీమిండియా ధరించే జెర్సీలకు అపోలో టైర్స్ ప్రయోజక కర్తగా ఉంటుంది.
గతంలో ఎలా ఉండేదంటే
టీమిండియాకు తొలిసారిగా అధికారిక ప్రయోజన కర్తగా ఐటీసీ లిమిటెడ్ వ్యవహరించింది. 1993 నుంచి 2001 వరకు ఐటీసీ అధికారిక ప్రయోజన కర్తగా ఉంది. అప్పట్లో టెస్ట్ కి 35 లక్షలు, వన్డేకు 32 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.
2001 నుంచి సహారా ప్రవేశించింది.. 12 సంవత్సరాలపాటు సహారా టీమ్ ఇండియాకు ప్రయోజక కర్తగా వ్యవహరించింది. 2010లో ఈ స్పాన్సర్ షిప్ అత్యంత భారీ ధరకు రెన్యువల్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక మ్యాచ్ 3.34 కోట్లు చెల్లించే విధంగా అప్పట్లో ఒప్పందం కుదిరింది. దీనికి తోడు సహారా ఐపీఎల్లోనూ ప్రవేశించింది. పూనే జట్టుకు యాజమాన్యంగా వ్యవహరించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఏర్పడిన విభేదాల వల్ల 2013లో సహారా సంస్థ తన అగ్రిమెంట్ వదులుకుంది.
ఇక 2014లో అనేక కంపెనీల నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని ఎదుర్కొని స్టార్ కంపెనీ ప్రయోజక కర్త హక్కులను పొందింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ద్వైపాక్షిక మ్యాచ్ కు 1.92 కోట్లు, అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే మ్యాచులకు 61 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. 2017లో ఈ ఒప్పందం పూర్తయింది. ఆ తర్వాత రెన్యూవల్ కాలేదు.
ఆ తర్వాత ఒప్పో సంస్థ 1079 కోట్ల రికార్డు ధరకు డీల్ కుదురుచుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ద్వైపాక్షిక మ్యాచ్ కు 4.61 కోట్లు.. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే మ్యాచులకు 1.51 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది.
తర్వాత 2019లోనే ఆ కంపెనీ పక్కకు వెళ్లిపోయింది. 2019లో బైజుస్ ఎంట్రీ ఇచ్చింది. మూడు సంవత్సరాల పాటు అధికారిక ప్రయోజక కర్తగా కొనసాగింది.
2023 మార్చి నుంచి డ్రీమ్ -11 అధికారిక ప్రయోజకకర్తగా ఎంపికైంది. 158 మ్యాచ్లకు 358 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. భారత క్రికెట్ నియద్రణ మండలం నిర్వహించే ఒక్కో ద్వైపాక్షిక మ్యాచ్ కు 4 కోట్లు.. ఐసీసీ నిర్వహించే మ్యాచ్ కు కోటి రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ కారణంగా ఈ కంపెనీ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంది. దీంతో ఇప్పుడు అపోలో టైర్ల కంపెనీ స్పాన్సర్ గా ఎంపిక అయింది.
#TeamIndia Apollo Tyres
BCCI announces Apollo Tyres as new lead Sponsor of Team India.
All The Details @apollotyreshttps://t.co/dYBd2nbOk2
— BCCI (@BCCI) September 16, 2025