Cricketer Shree Charani: టీమిండియా మహిళలు వన్డే వరల్డ్ కప్ సాధించారు. దశాబ్దల కలను నిజం చేశారు. వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్టులో కడప జిల్లాకు చెందిన 21 సంవత్సరాల శ్రీ చరణి కూడా ఉంది. ఆమె అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకుంది.. దిగ్గజ ప్లేయర్లను అవుట్ చేసి టీమిండియా విజయాలు సాధించడంలో ముఖ్యపాత్ర పోషించింది.. దీంతో శ్రీ చరణి పేరు మార్మోగిపోయింది.. రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్ కూడా శ్రీ చరణి బౌలింగ్ గొప్పగా ఉందంటూ పేర్కొన్నాడు. ఆమె బంతిని తిప్పుతుంటే అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించాడు.
శ్రీ చరణి ఉత్తమ ప్రదర్శన చూపించిన నేపథ్యంలో తెలుగు మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. ఆంధ్రప్రదేశ్లో వైసిపి అనుకూల మీడియా మాత్రం మరో విధమైన పల్లవి అందుకుంది.. శ్రీ చరణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టి చంద్రబాబు పక్షపాతం చూపిస్తున్నారని.. ఆ స్థాయిలో విజయం సాధించినప్పటికీ ఆమెను గుర్తించడం లేదని శోకాలు పెట్టింది. చివరికి ఒక ఉమెన్ క్రికెటర్ వ్యవహారాన్ని కూడా తనకు రాజకీయంగా వాడుకుంది. వాస్తవానికి టీమిండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత ప్లేయర్లు మొత్తం ప్రధానమంత్రిని కలిశారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిశారు. నిన్న సాయంత్రం ప్లేయర్లు వారి వారి సొంత ప్రదేశాలకు బయలుదేరారు.. ఈ నేపథ్యంలో శ్రీ చరణి ఏపీ గడ్డ మీద అడుగు పెట్టింది.
ఏపీకి వచ్చిన శ్రీ చరణి కి ముగ్గురు మంత్రులు విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్.. ఇతర మంత్రులను శ్రీ చరణి కలిసింది. వారితో చాలాసేపు మాట్లాడింది.. వరల్డ్ కప్ ప్రయాణం గురించి చెప్పింది.. తాను ఎంత ఒత్తిడి ఎదుర్కొంది.. ఈ స్థాయిలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడింది అన్ని పూసగుచ్చినట్టు వివరించింది. ఈ నేపథ్యంలో శ్రీ చరణి కి ఏపీ ప్రభుత్వం రెండున్నర కోట్ల నగదును ప్రకటించింది. కడపలో ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ప్రకటించింది.. అంతేకాదు పత్రికలలో ఫుల్ పేజీ వెల్కమ్ యాడ్స్ కూడా ఇచ్చింది.. ఇక ఇప్పటిదాకా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రేణుకకు కోటి నగదు, ఉద్యోగాన్ని ప్రకటించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్ కు కోటి రూపాయల నగదు అందించింది. స్మృతి, రాధా, జెమిమా కు మహారాష్ట్ర ప్రభుత్వం 2.25 కోట్ల చొప్పున నగదు బహుమతిని ప్రకటించింది. వాస్తవానికి శ్రీ చరణి ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. విస్మరిస్తోందని వైసీపీ కొద్దిరోజులుగా నెగిటివ్ ప్రచారం చేస్తోంది.. మరి ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ చరణి మీద వరాలు కురిపించిన తర్వాత వైసిపి, దాని అనుకూల మీడియా తల ఎక్కడ పెట్టుకుంటుందోనని కూటమినేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చివరికి క్రీడలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వైసీపీపై మండిపడుతున్నారు కూటమినేతలు.