Jagan Students Welfare: పోయిన చోట వెతుక్కోవాలని చూస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఎక్కడైతే తనకు నష్టం జరిగిందో అక్కడ.. నష్ట నివారణ చర్యలకు దిగారు. ముఖ్యంగా ఈసారి విద్యార్థులతో పాటు యువత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. దాని ఫలితమే 2024లో ఘోర పరాజయం. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓటింగ్ దక్కింది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న విద్యార్థులు, యువత మాత్రం ఓటు వేయలేదు. అందుకే ఇప్పుడు విద్యార్థి విభాగం పై దృష్టిపెట్టారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా తాడేపల్లిలో వైసీపీ విద్యార్థి విభాగంతో సమావేశం అయ్యారు. వారికి దిశ నిర్దేశం చేశారు.
విద్యార్థి పథకాల్లో ఫెయిల్యూర్..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి సంక్షేమ పథకాలు కొండంత అండగా నిలిచాయని అంతా చెప్పుకుంటున్నారు. కానీ ఆ పార్టీకి మైనస్ కూడా అదే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు కాలేదు. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన అందించలేకపోయారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకంగా పిలిచే విదేశీ యానాన్ని నిలిపివేశారు. కాపులతో పాటు బలహీనవర్గాలకు సంబంధించి విదేశీ విద్యను దూరం చేశారు. నాడు నేడు తో పాఠశాలలను అభివృద్ధి చేశారు. అమ్మ ఒడి అందించగలిగారు. అయితే మొత్తం విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. కానీ పాఠశాలలను విలీనం, తరగతి గదుల ఎత్తివేత వంటివి మైనస్ గా మారాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. 2024 ఎన్నికల్లో ఇవి స్పష్టంగా పనిచేసాయి. విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
విద్యార్థులతో ప్రభుత్వం పై ఉద్యమం..
అయితే దేశంలో అతి శక్తివంతమైన వర్గంలో విద్యార్థి లోకం ఒకటి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సైతం అప్గ్రేట్ అవుతున్నారు. డిజిటల్ మీడియా( digital media) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో విద్యార్థులు చేసే ప్రచారానికి చాలా విలువ ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విద్యార్థులను తన గ్రిప్ లో పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు చాలా రకాల పథకాలు తాను ప్రవేశపెట్టానని.. కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని వారికి బోధించారు. వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపి వేసిందని వ్యతిరేకత పెంచేలా వ్యాఖ్యానాలు చేశారు. విద్యార్థుల్లో బలంగా ప్రచారం చేసి పార్టీ పట్ల ప్రజలు యూటర్న్ అయ్యేలా చూడాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ ప్రయత్నాలు విద్యార్థి లోకంలో ఎంతవరకు పనిచేస్తాయి అన్నది చూడాలి.