PAK Vs USA T20 World Cup: పసికూన కాదు.. కసి కొద్దీ ఆడింది.. పాకిస్తాన్ కు.. అమెరికా “సూపర్” షాక్..

గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అమెరికా సంచలన విజయం నమోదు చేసింది.. దీంతో పాకిస్తాన్ జట్టుకు కోలు కోలేని షాక్ తగిలింది. సూపర్ -8 లో ప్రవేశించేందుకు అమెరికా జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత అవసరం.. ఈ గెలుపుతో ఆ జట్టు సూపర్ - 8 లోకి సులువుగా వెళ్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 7, 2024 8:35 am

PAK Vs USA T20 World Cup

Follow us on

PAK Vs USA T20 World Cup: ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. అమెరికా 18వ స్థానంలో ఉంది.. ఒకవేళ ఈ రెండు జట్లు తలపడితే.. ఏ ప్రకారం చూసుకున్నా పాకిస్తాన్ దే గెలుపు అని అందరూ అంటారు. పైగా ఈ జట్టుతో పోలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో పాకిస్తాన్ ది పై చేయిగా ఉంది.. అయితే అలాంటి పాకిస్తాన్ జట్టును పసికూన లాంటి అమెరికా జట్టు మట్టి కరిపించింది. గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అమెరికా సంచలన విజయం నమోదు చేసింది.. దీంతో పాకిస్తాన్ జట్టుకు కోలు కోలేని షాక్ తగిలింది. సూపర్ -8 లో ప్రవేశించేందుకు అమెరికా జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత అవసరం.. ఈ గెలుపుతో ఆ జట్టు సూపర్ – 8 లోకి సులువుగా వెళ్తుంది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో 1 ఫోర్, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్ లు గా నిలిచారు.. అమెరికా బౌలర్లలో కెంజిగే(3/30), సౌరభ్ నేత్రావల్కర్ (2/18) అదరగొట్టారు.

పాకిస్తాన్ విధించిన 160 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన అమెరికా.. మూడు వికెట్ల కోల్పోయి 159 పరుగులు చేసింది.. అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), అరోన్ జోన్స్(36*; 26 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఆండ్రీస్ గౌస్(35; 26 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్) అదరగొట్టారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అమీర్, నసీం షా, హరీస్ రౌఫ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఒకానొక దశలో అమెరికా గెలుపు దిశగా సాగింది. 13 ఓవర్లలో 104/1 వద్ద స్థిరంగా కనిపించింది. కానీ ఆ సమయంలో పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ, మ్యాచ్ పాకిస్తాన్ వైపు మొగ్గేలా చేశారు. 18 ఓవర్ వేసిన షాహిన్ ఆఫ్రిది 7 రన్స్, 19వ ఓవర్ వేసిన మహమ్మద్ అమీర్ 6 రన్స్ ఇచ్చారు. దీంతో అమెరికా విజయానికి చివరి ఓవర్ లో 15 పరుగులు కావాల్సి వచ్చింది. చివరి ఓవర్ ను సీనియర్ బౌలర్ హారీస్ రౌఫ్ వేశాడు. అయితే అతడు తొలి 3 బంతులకు మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ దశలో నాలుగో బంతిని ప్రమాదకరమైన జోన్స్ సిక్స్ గా మలచాడు. అయితే ఐదు బంతికి సింగిల్ కొట్టాడు. ఈ దశలో అమెరికా గెలుపు సమీకరణం చివరి బంతికి ఐదు పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో హారీస్ వేసిన చివరి బంతిని నితీష్ బౌండరీ కొట్టాడు. ఫలితంగా మ్యాచ్ టైగా ముగిసింది.. అది సూపర్ ఓవర్ కు దారి తీసింది.

ఈ సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ అమీర్ వేశాడు. తొలి మూడు బంతులలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత మూడు బంతులు వేయడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించాడు. వైడ్ల మీద వైడ్లు వేశాడు. ఏకంగా ఏడు పరుగులు సమర్పించుకున్నాడు.. ఫలితంగా అమెరికా 18 పరుగులు చేసింది. ఈ సూపర్ ఓవర్ చేదనలో పాకిస్తాన్ తేలిపోయింది. ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ లో రెండవ బంతిని ఫోర్ కొట్టిన ఇఫ్తికర్ మూడో బంతికి ఔట్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన షాబాద్ పాక్ ను విజయతీరాలకు మళ్లించలేకపోయాడు. దీంతో అమెరికా సంచలన విజయ నమోదు చేసింది. సూపర్ -8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.