Ambati Rayudu : అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం.. అంతా అవాక్కు

టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా తమ జట్టు తరఫున రాయుడు అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా లీగ్ లో మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షిస్తోంది. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత రాయుడు ఆడుతున్న తొలి లీగ్ లో మంచి ప్రదర్శన కనబరచాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Written By: BS, Updated On : June 16, 2023 11:10 am
Follow us on

Ambati Rayudu : తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడనున్నాడు. ఇదేంటి రాయుడు కొద్ది రోజుల కిందటే రిటైర్మెంట్ ప్రకటించాడు కదా..? మళ్లీ ఇప్పుడు ఆడటం ఏమిటి అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే. అంబటి రాయుడు సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం కాదు. అమెరికాలో నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎం ఎల్ సి) లోని టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు. ఈ జట్టు తరపున అంబటి రాయుడు క్రికెట్ ఆడనున్నాడు. ఈ ఏడాదే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అమెరికాలో ప్రారంభమవుతోంది. ఈ లీగ్ లోని కీలక జట్లలో ఒకటి అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు అంబటి రాయుడు ను కొనుగోలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇటువైపు ఆలోచించని అమెరికాలో కూడా లీగ్ క్రికెట్ ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ లీగ్ లో భారతదేశం నుంచి అంబటి రాయుడు ఆడబోతున్నాడు. భారతదేశానికి ఆడిన ఇండియన్ క్రికెటర్లలో అంబటి రాయుడు మాత్రమే ఈ లీగ్ లో ఆడుతుండడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఈ లీగ్ లో ఆడుతున్న తొలి భారత సీనియర్ క్రికెటర్ గా అంబటి రాయుడు నిలిచిపోనున్నాడు.
ఆరు జట్లతో లీగ్ ప్రారంభం.. 
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆరు జట్లతో ఈ ఏడాది ప్రారంభిస్తున్నారు. జూలై 17 నుంచి 31మధ్య ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అమెరికాలోని పలు నగరాల్లో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన బ్రేవో సారధ్యంలోని టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా చేరాడు. వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడడంతో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. టెక్సాస్ జట్టులో విదేశీ ప్లేయర్లుగా అంబటి రాయుడు, డేవాన్ కాన్వే, మిచెల్ శాంటనెర్, డేవిడ్ మిల్లర్, బ్రేవో, డానియల్ సామ్స్, గెరాల్డ్ కోయిటీజీ ఉన్నారు.
రిటైర్మెంట్ ప్రకటన తర్వాత క్రికెట్..
అంబటి రాయుడు కొద్ది వారాల కిందటే తన క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చెన్నై జట్టు తరఫున ఆడిన రాయుడు మంచి స్కోర్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్  ఫైనల్ లో విజయంతో చెన్నై జట్టు ట్రోఫీని కూడా గెలుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ తోపాటు ఐపీఎల్ క్రికెట్ కు కూడా రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ ప్రకటన తరువాత అంబటి రాయుడు ఆడుతున్న తొలి లీగ్ ఇదే కావడం గమనార్హం. రాయుడికి ఉన్న క్రేజ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ కు ఉపయోగపడుతుందని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇకపోతే టెక్సాస్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం జూన్ 15న ప్రకటన చేసింది.
ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయుడు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు. 204 మ్యాచులు ఆడిన రాయుడు 4348 పరుగులు చేశాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా తమ జట్టు తరఫున రాయుడు అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా లీగ్ లో మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షిస్తోంది. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత రాయుడు ఆడుతున్న తొలి లీగ్ లో మంచి ప్రదర్శన కనబరచాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.