Ambati Rayudu: ఆడ లేక మద్దెల ఓడు.. అనే సామెత మీరు ఎప్పుడైనా చదివారా.. పోనీ నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా.. మీ సంగతి ఏమోగానీ.. ఈ సామెత టీమిండియా మాజీ క్రికెటర్ విషయంలో మాత్రం నిజమైంది. ఇలా జరగడానికి బయటి వారి కారణం కాదు.. ఏనుగు తన తొండంతో నెత్తి మీద తానే దుమ్ము పోసుకున్నట్టు.. తిక్క తిక్క వ్యాఖ్యలు చేస్తూ ఆ క్రికెటర్ పది మందిలో పలుచనవుతున్నారు. ఇటీవల తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి రకరకాల నిర్ణయాలు తీసుకొని వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డాడు. ఇంతకీ అతడు ఎవరంటే.
అంబటి రాయుడు.. ఈ పేరును క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాటిగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నప్పటికీ అంతర్గత రాజకీయాల వల్ల అంబటి రాయుడికి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో అతడు జాతీయ జట్టుకు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడాడు. ఆ జట్టు ఐపీల్ ట్రోఫీలు గెలుచుకోవడంలో తన వంతు కృషి చేశాడు. తెలుగు ప్రాంతానికి చెందిన ఆటగాడిగా విశేషమైన గుర్తింపు సంపాదించాడు. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ.. అంబటి రాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పై అంబటి రాయుడు చేసిన ఆరోపణలు చర్చకు దారితీస్తున్నాయి. విరాట్ కోహ్లీ పై రాయుడు ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు.. చెన్నై జట్టును ఇటీవల ఐపీఎల్ సీజన్లో బెంగళూరు ఓడించింది. చెన్నై జట్టుపై సాధించిన గెలుపు ద్వారా ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. గతంలో రాయుడు చెన్నై జట్టుకు ఆడడం.. తన కెరియర్ సక్రమంగా సాగకపోవడానికి విరాట్ కోహ్లీనే కారణమని భావించి, తలా తోకా లేని ఆరోపణలు చేశాడు.
అవసరం ఉన్నా, లేకపోయినా.. విరాట్ కోహ్లీ ఆట తీరును, బెంగళూరు ప్రదర్శనను ఏదో ఒక రూపంలో అంబటి రాయుడు ప్రస్తావిస్తున్నాడు. మోకాలికి, బోడి గుండుకు లంకె పెడుతూ విమర్శలు చేస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ కోల్ కతా కైవసం చేసుకున్న సంగతి విధితమే. హైదరాబాద్ జట్టుతో ఆదివారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఈ విజయాన్ని అభినందిస్తూనే.. బెంగళూరు, విరాట్ కోహ్లీపై ఆరోపణలు చేశాడు..” ఆరెంజ్ క్యాప్ లతో టైటిల్ రాదు. ఆరెంజ్ క్యాప్ ల వల్ల ట్రోఫీలు గెలవలేమని” రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 15 మ్యాచులు ఆడి.. 741 రన్స్ చేశాడు. ఇందులో ఒక శతకం, ఐదు అర్థ శతకాలు ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ వల్లే బెంగళూరు టైటిల్ గెలవలేకపోయిందని రాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మాయాంతి లాంగర్ తో కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీ పై తనకున్న విద్వేషాన్ని బయట పెట్టుకున్నాడు. “బెంగళూరు జట్టుకు ప్రధాన సమస్య విరాట్ కోహ్లీనే. లీగ్ దశలో అతడు నెలకొల్పిన ప్రమాణాలు జట్టులోని ఇతర ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాయి. వారు ఒత్తిడికి గురవుతున్నారు. బెంగళూరులో కోహ్లీ ఒక దిగ్గజ ఆటగాడు. ప్రతి సీజన్లో అతడు అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. కోహ్లీ తన దూకుడైన ఆట తీరును తగ్గించుకోవాలి. కుర్రాళ్ళు స్వేచ్ఛగా ఆడే విధంగా చూడాలి. అప్పుడే మిగతా ఆటగాళ్లు ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలరని” రాయుడు వ్యాఖ్యానించాడు. అంతకుముందు వరల్డ్ కప్ లో తనను కాకుండా విజయ్ శంకర్ ను కెప్టెన్ గా ఉన్న కోహ్లీ జట్టులోకి తీసుకున్నాడు. ఆ పాత పగలతోనే రాయుడు ఈ కామెంట్స్ చేస్తున్నాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.