T20 World Cup 2024: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమకాలీన క్రికెట్లో వీరిద్దరిలాగా దూకుడుగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు అరుదుగా ఉన్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించాడు. టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్లలో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. రోహిత్ శర్మ కూడా అదే విధంగా దూసుకుపోతున్నాడు. అయితే వీరిద్దరూ టి20 క్రికెట్లో నెలకొల్పిన రికార్డుకు ఇప్పుడు ముప్పు ఏర్పడనుంది. టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతడు 117 t20 మ్యాచ్ లు ఆడి, 4,037 రన్స్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 150 టి20 మ్యాచ్ లు ఆడి, 3,974 రన్స్ చేశాడు.
అయితే వీరిద్దరికి సమకాలీన క్రికెట్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ దగ్గరలో ఉన్నాడు. ఇతడు 114 t20 మ్యాచ్ లు ఆడి, 3,823 రన్స్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ రోహిత్ శర్మ కంటే 151, కోహ్లీ కంటే 214 రన్స్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్టు జరిగిన టి20 సిరీస్ ను సమం చేసుకుంది. ఈ సిరీస్ లో బాబర్ చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. టి20 వరల్డ్ కప్ కు ముందు పాకిస్తాన్ జట్టు మే 10 నుంచి ఐర్లాండ్ దేశంలో మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశ పర్యటనకు వెళ్తుంది. ఇంగ్లాండ్ లో 4 t20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ లలో బాబర్ రాణించగలిగితే, విరాట్, రోహిత్ శర్మ రికార్డు బద్దలవుతుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే బాబర్ ధాటిగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. పైగా అతడికి టి20 మ్యాచ్ లలో మెరుగైన రికార్డు ఉంది.
ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 18 మందితో జట్టును ప్రకటించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రకారం టి20 ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుదించనుంది. జూన్ రెండు నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచ కప్ నిర్వహిస్తాయి. భారత్ ఉన్న గ్రూపులోనే పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ జట్టు తన తొలి టి20 మ్యాచ్ ను జూన్ 9న ఆర్చి రైల్స్ జట్టుతో న్యూయార్క్ లో ఆడుతుంది.