England vs India : 10 ఏళ్లకుపైగా అక్కడే ఓటమి.. రోహిత్ సేన ఏం చేస్తుందో?

ఈ సీరిస్ గెలిస్తే భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

Written By: NARESH, Updated On : February 26, 2024 12:11 pm
Follow us on

England vs India : ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగించినట్టే. రెండవ ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 5, కుల దీప్ యాదవ్ 4, జడేజా 1 వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ జట్టు 145 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం, రెండవ ఇన్నింగ్స్ లో 145 తో కలిపి మొత్తం 191 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఇంగ్లాండ్ ఉంచింది. బజ్ బాల్ ఆట తో భారత్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచాలని ఇంగ్లాండ్ భావించింది. కానీ భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (5/51), కులదీప్ యాదవ్ (4/22) ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ జట్టులో క్రాలే(60), బెయిర్ స్టో(30) మాత్రమే రాణించారు.

192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మూడవరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.. కెప్టెన్ రోహిత్ శర్మ (24), యువ సంచలనం జైస్వాల్ (16) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. సిరీస్ విజయానికి 152 పరుగుల దూరంలో రోహిత్ సేన ఉంది. ఆట ఇంక రెండు రోజులు ఉంది. భారత్ చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఏ కోణం చూసుకున్నా సరే భారత్ వైపే గెలుపు కనిపిస్తోంది. మైదానం పై పగుళ్లు ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఎలాంటి బౌలింగ్ వేస్తారోననే ఆందోళన భారత అభిమానుల్లో కనిపిస్తోంది. బంతి విపరీతమైన మెలికలు తిరగడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు మూడోరోజు విపరీతమైన ఇబ్బంది పడ్డారు.. అశ్విన్, కులదీప్ కలిసి 9 వికెట్లు పడగొట్టారంటే మైదానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం తొలి సెషన్ భారత జట్టుకు అత్యంత కీలకమని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ ఏకంగా 5 వికెట్లు తీశాడు. సోమవారం అతడితోనే ఇంగ్లాండ్ కెప్టెన్ ఎక్కువ ఓవర్లు వేయించే అవకాశం ఉంటుంది. మైదానంపై పగుళ్లు ఏర్పడిన నేపథ్యంలో బషీర్ తన స్పిన్ తో మ్యాజిక్ చేస్తాడని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది.

నాలుగో టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. సిరిస్ విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. కాకపోతే గత గణాంకాలు భారత అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయి. 2013లో సొంతగడ్డపై చివరిసారిగా రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 150 కంటే ఎక్కువ స్కోర్ ను ఛేదించింది. పది సంవత్సరాలుగా 150 పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ ఉంటే భారత్ ఓడిపోతూ వస్తోంది. మరి ఈసారి రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఆ అపప్రద ను చెరిపేసి చరిత్ర సృష్టించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ నాలుగో టెస్ట్ గెలిస్తే 3 -1 తో ఇంకో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఈ సీరిస్ గెలిస్తే భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.