Afghanistan vs South Africa : ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే: సెమీస్ లో కుప్పకూలి ఓడిన ఆఫ్ఘనిస్తాన్ !

Afghanistan vs South Africa : సౌతాఫ్రికా ఈజీగా లక్ష్యాన్ని చేధించింది. తొలి వికెట్ డికాక్ 5 పరుగలకే ఔట్ అయినా కెప్టెన్ మార్క్రమ్, హెండ్రిక్స్ జాగ్రత్తగా ఆడి 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఫైనల్ చేరుకున్నారు.

Written By: NARESH, Updated On : June 27, 2024 8:16 am

Afghanistan vs South Africa

Follow us on

Afghanistan vs South Africa : లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టును ఓడించింది. సూపర్ -8 ఆస్ట్రేలియాను పడుకోబెట్టింది. ఉత్కంఠ మధ్య బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. దీంతో తొలిసారి సెమీఫైనల్ వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్.. దక్షిణాఫ్రికా పై లీగ్, సూపర్ -8 స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయింది.. 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. ఇందులో దక్షిణాఫ్రికా బౌలర్లు 13 పరుగులను ఎక్స్ ట్రా ల రూపంలో ఇచ్చారు. లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 43 పరుగుల వద్దే ఆగిపోయేది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో ఆజ్మతుల్లా చేసిన పది పరుగులే టాప్ స్కోర్. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, మార్కో జాన్సన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.. రబాడ, నోర్ట్జే చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. రబడా ఒక ఓవర్ మెయిడిన్ గా సంధించడం విశేషం.సౌతాఫ్రికా ఈ లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. మార్క్రమ్ 23 పరుగులు, హెండ్రిక్స్ 29 పరుగులతో రాణించారు.

టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం తప్పని దక్షిణాఫ్రికా బౌలర్లు తొలి ఓవర్ నుంచే నిరూపించారు. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ గుర్బాజ్ 0 పరుగులకే వెను తిరిగాడు. జాన్సన్ బౌలింగ్లో హెండ్రిక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ ఓవర్ ముగిసేసరికి నాలుగు పరుగులు మాత్రమే. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(2) రెండు పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన గుల్బాదిన్ (9) కాసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. జాన్సన్ విసిరిన బంతికి గుల్బాదిన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్లను కాసేపు కాచుకున్న ఆజ్మతుల్లా (10) కూడా నోర్ట్జే కు చిక్కాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నబీ(0) నిరాశపరిచాడు. నగేలియా కరోటే (2), కరీం జనత్ (8), రషీద్ ఖాన్ (8), నూర్ అహ్మద్ (0), నవీన్ ఉల్ హక్(2) పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే కుప్పకూలింది.

వాస్తవానికి ట్రినిడాడ్ మైదానం చాలా కఠినమైనది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుంటేనే ఎంతోకొంత ఉపయోగం ఉంటుంది. కానీ రషీద్ ఖాన్ ఎలాంటి అంచనా వేయకుండా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపించడం ఆఫ్ఘనిస్తాన్ ను దెబ్బకొట్టింది.. దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.. ముఖ్యంగా జాన్సన్, షమ్సీ నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశారు. వీరిద్దరి తాకిడికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలబడలేకపోయారు.. వాస్తవానికి ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నప్పటికీ.. ఒత్తిడిలో ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు.

సౌతాఫ్రికా ఈజీగా లక్ష్యాన్ని చేధించింది. తొలి వికెట్ డికాక్ 5 పరుగలకే ఔట్ అయినా కెప్టెన్ మార్క్రమ్, హెండ్రిక్స్ జాగ్రత్తగా ఆడి 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఫైనల్ చేరుకున్నారు. ఇంగ్లండ్, ఇండియా రెండో సెమీ ఫైనల్స్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో సౌతాఫ్రికాతో తలపడుతారు.