https://oktelugu.com/

AFG VS SA : వన్డేల్లో అద్భుతాన్ని ఆవిష్కరించిన ఆఫ్ఘనిస్తాన్.. పాపం సౌతాఫ్రికా.. మరీ ఇంత దారుణంగానా..

ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరుకొని ఆఫ్గానిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది. మేటి జట్లను మట్టికరిపించి ఔరా అనిపించింది. అదే ఆట తీరును ఆ జట్టు కొనసాగిస్తోంది. స్వదేశంలో క్రికెట్ పై నిషేధం విధిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆఫ్ఘనిస్తాన్ సంచలన ఆట తీరును ప్రదర్శిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 19, 2024 / 09:48 AM IST

    AFG VS SA

    Follow us on

    AFG VS SA :  షార్జా వేదికగా సౌత్ ఆఫ్రికా జట్టుతో ఆఫ్గనిస్తాన్ 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ను 33.3 ఓవర్లలోనే 106 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఏ ఫార్మాట్ ప్రకారం చూసుకున్నా దక్షిణాఫ్రికా జట్టును ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఆల్ అవుట్ చేయడం ఇదే తొలిసారి.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు రెండు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడింది. కానీ గతంలో ఒక్కసారి కూడా ఆల్ అవుట్ చేయలేదు. కానీ ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. చిత్రవిచిత్రమైన ఎత్తులు వేసి సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తు చేశారు.. దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలవడంతో.. మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ తీసుకుంది. కానీ అది ఎంత చెత్త నిర్ణయమో ఆ జట్టుకు తర్వాత అనుభవంలోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఫరూకీ, 18 సంవత్సరాల కుర్ర బౌలర్ అల్లా గజన్ఫర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 36 పరుగులకే 7 కీలకమైన వికెట్లను నష్టపోయింది.. ఫరూకీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(9) ను ఫరూకీ మూడవ ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే కెప్టెన్ మార్క్రమ్(2) ను క్లీన్ బౌల్ద్ చేసి వెనక్కి పంపించాడు. ఇదే జోరును ఫరూకీ కంటిన్యూ చేస్తూ మరుసటి ఓవర్ లో టోనీ డిజోర్జి (11) ను పెవిలియన్ పంపించాడు. ఫరూకీ కి గజన్ఫర్ తోడు కావడంతో సౌత్ ఆఫ్రికా కష్టాలు మరింత పెరిగాయి.. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా.. వీరిద్దరూ బౌలింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 17/1, 24/2, 25/3, 29/4, 29/5, 36/6, 35/7.. ఇలా సౌత్ ఆఫ్రికా వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో వియాన్ (52), పోర్ట్ మన్(16) కొద్దిసేపు ఆఫ్గనిస్తాన్ బౌలర్లను ప్రతిఘటించారు. వీరు ఎనిమిదో వికెట్ కు 39 పరుగులు జత చేశారు. ఈ దశలో పోర్ట్ మన్ రషీద్ ఖాన్ చేతిలో బలయ్యాడు. ఆ తర్వాత వియాన్ కాస్త మెరుపులు మెరిపించాడు. ఈ దశలో వియాన్ హాఫ్ సెంచరీ చేయడంతో సౌత్ ఆఫ్రికా 100 పరుగుల మార్క్ దాటింది.. అయితే జోరు మీదున్న వియాన్ ను ఫరూకీ అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికాకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రషీద్ ఖాన్ చివరి వికెట్ పడగొట్టి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ కు ఎండ్ కార్డు వేశాడు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరూకీ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. గజన్ఫర్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు.

    ఆఫ్ఘనిస్తాన్ కూడా

    107 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసి విజయం సాధించింది. అజ్మతుల్లా ఓమార్జాయ్(25*) నైబ్(34*) ఆఫ్గనిస్తాన్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. తక్కువ స్కోరు అయినప్పటికీ.. చేదనలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. రెహమానుల్లా గుర్బాజ్ తాను ఎదుర్కొన్న మూడో బంతికే అవుట్ అయ్యాడు. అతడు డక్ అవుట్ గా వెనుతిరిగాడు. రహమత్ షా 8 పరుగులకు అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రియాజ్ హాసన్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ 38 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. దీంతో సౌత్ ఆఫ్రికా సంచలన విజయం సాధించేలాగా కనిపించింది. మరోవైపు ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ హస్మతుల్లా 16 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ దశలో అజ్మతుల్లా, గుల్బాదిన్ నిదానంగా ఆడారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆరు వికెట్ల తేడాతో ఆఫ్గానిస్థాన్ కు అద్భుతమైన గెలుపును అందించారు. శుక్రవారం షార్జా వేదికగానే.. రెండవ వన్డే జరుగుతుంది. కాగా, సౌత్ ఆఫ్రికా పై ఆఫ్గనిస్తాన్ కు ఇదే తొలి విజయం. బంతుల పరంగా చూసుకుంటే టెస్ట్ ఆడే జట్లపై ఆఫ్ఘనిస్తాన్ సాధించిన మూడవ అతిపెద్ద గెలుపు ఇది. 146 బంతుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఈ విజయాన్ని అందుకుంది.. భారత జట్టుపై తప్ప మిగిలిన పూర్తిస్థాయి టెస్ట్ ఆడే సభ్య దేశాలపై ఆఫ్గనిస్తాన్ విజయం సాధించింది.