Pakistan tri-series: పాకిస్తాన్–ఆఫ్గానిస్తాన్ మధ్య ఓవైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు పాకిస్తాన్ దాడులు కొనసాగిస్తోంది. ఒవైపు శాంతి అంటూనే మరోవైపు దాడులు కొనసాగించడంతో ఆఫ్గాన్‌లో సామాన్యులు మృతిచెందుతున్నారు. యుద్ధ ధర్మాన్ని కూడా పాకిస్తాన్ విస్మరిస్తోంది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గానిస్థాన్ క్రికెట్ సమాజం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పక్చికా ప్రావిన్స్‌లోని ఉర్‌గూన్ జిల్లాకు చెందిన ముగ్గురు స్థానిక క్రికెటర్లు కబీర్, సిబ్గతుల్లా, హరూన్ మరణించారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఆగ్రహంతో ఉన్న బోర్డు పాకిస్తాన్–శ్రీలంకతో జరుగబోయే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ‘పాక్ విధానం పిరికివాద చర్య. మన దేశం, క్రీడా కుటుంబం కోల్పోయిన ఈ యువకులు అఫ్గాన్ క్రీడా చరిత్రలో చెరగని ముద్రవేశారు’ అని పేర్కొంది.
క్రికెటర్ల కలలను చిదిమేసిన పాక్..
ఈ క్రికెటర్లు షరణాలో జరిగిన ఒక స్థానిక టోర్నమెంట్‌లో పాల్గొన్న తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఆ సాయంత్రం జరిగిన దాడిలో వీరితోపాటు ఐదుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కబీర్ అఘా అగ్రక్రమ బ్యాట్స్‌మన్‌గా అఫ్గాన్ –23 జట్టుకు ఎంపిక అవ్వబోతున్నట్లు సమాచారం. హరూన్, సిబ్గతుల్లా ఇద్దరూ పక్తికా జిల్లా జట్లలో స్థిరమై ఎదుగుతున్న ఆటగాళ్లు. జాతీయ జట్టుకు ఆడాలన్న వీరి కలలను పాకిస్తాన్ చిదిమేసింది. ఈ ఘటన తర్వాత క్రీడ కంటే మానవత్వమే ముఖ్యమని సందేశంతో ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న వైదొలుగు నిర్ణయం కేవలం క్రీడా నిరసన కాదు, అది ప్రతీకార ధోరణిపై మానవ విలువల ఆధిపత్యానికి సూచికగా భావించవచ్చు.
ఇది క్రీడకారుల హత్య..
అఫ్గాన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో, ‘ఇది అమాయక ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్న నరమేధం. మన జట్టుకు ఇది కేవలం నష్టం కాదు, దేశ గౌరవంపై దాడి’ అని వ్యథ వ్యక్తం చేశారు. మొహమ్మద్ నబీ ‘‘ఇది కేవలం పక్తికా దుఃఖం కాదు, మొత్తం దేశానికి మానసిక దెబ్బ’’ అని పేర్కొన్నారు. గుల్బదీన్ నయీబ్ ఈ ఘటనను ‘అమానుషమైన దాడి’గా అభివర్ణించారు.
యుద్ధవిరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ వైమానిక దాడులు జరగడం, పాక్‌పై అంతర్జాతీయ విమర్శలను పెంచింది. క్రీడ వంటి సయోధ్య దారులకే ఇలాంటి దాడులు జరగడం వల్ల రెండు దేశాల మధ్య నమ్మకం పూర్తిగా ధ్వంసమైందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రీడల ద్వారా దేశాల మధ్య స్నేహం పెరగాలనే ఆశతో పాకిస్తాన్‌ను అంగీకరించిన అఫ్గాన్ బోర్డు, ఇప్పుడు క్రీడకంటే మానవ ప్రాణం ముఖ్యమని ప్రపంచానికి సాకార సందేశం ఇచ్చింది.