Visakhapatnam Tragedy: భగవంతుడు కొంతమందికి అన్ని ఇస్తాడు. కష్టాలకు బదులుగా సుఖాలను.. కన్నీళ్ళకు బదులుగా ఆనందాలను.. ఇబ్బందులకు బదులుగా ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఇంకొందరికి మాత్రం కష్టాలను, కన్నీళ్లను, బాధలను టన్నులకొద్దీ ఇస్తుంటాడు. ఈమెకు కూడా అలాంటివి చాలా ఇచ్చాడు. వాటన్నిటిని ఓర్చుకుంది. పంటి బిగువన భరించింది. కాని చివరికి ఇద్దరు మగాళ్లు ఆమెను మోసం చేశారు. ఒకడు భర్తగా ఉంటూ.. ఇంకొకడు ప్రేమికుడిగా ఉంటూ.. ఆమెకు నరకం చూపించారు.
ఆమె పేరు సంధ్యారాణి.. పేరుకు తగ్గట్టుగానే అందంగా ఉంటుంది. ఈమె తండ్రి రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. ఒక సోదరుడు ఉన్నా.. అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంధ్యారాణికి ఆమె తల్లిదండ్రులు ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. మొదట్లో సంధ్యారాణి వైవాహిక జీవితం బాగానే ఉండేది. ఆ తర్వాత ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకరి ఆరోగ్యం బాగుంటే.. మరొక బాబు మానసిక వికలాంగుడు. దీంతో అటు భార్యను, ఇటు పిల్లల్ని వదిలించుకొని భర్త వెళ్లిపోయాడు.. పెద్దమనుషుల సమక్షంలో ఎన్ని పంచాయతీలు చేసినప్పటికీ అతడి మనసు కరగలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అతడు లొంగలేదు. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలు తీసుకొని విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం నందగిరి నగర్లోకి వచ్చింది. అక్కడ తన ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. సంధ్యారాణి వివాహం జరిగిన తర్వాత ఆమె తండ్రి చనిపోయాడు. అంతకుముందే తల్లి కూడా కాలం చేసింది. ఉన్న ఒక్క సోదరుడు కూడా అనారోగ్యం బారిన పడడంతో సంధ్యారాణి తన ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. సరిగ్గా 8 నెలల క్రితం సంధ్యారాణికి ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు అనే కార్పెంటర్తో పరిచయం ఏర్పడింది.. అది కాస్త సన్నిహిత సంబంధం గా మారింది. తరచూ అతడు సంధ్యారాణి ఇంటికి వస్తూ వెళ్లేవాడు. ఇటీవల సంధ్యారాణికి, శ్రీనివాస రావుకు గొడవ జరిగింది. ఆ గొడవ కొద్ది రోజుల తర్వాత సద్దుమణిగింది.
బుధవారం శ్రీనివాసరావు, సంధ్యారాణికి మధ్య భాగవతం జరిగింది. ఈ క్రమంలో ఆమె సాయంత్రం వాకింగ్ వెళ్తుండగా.. శ్రీనివాసరావు కత్తి తో దారుణంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెను అంతం చేసిన శ్రీనివాసరావు అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. శ్రీనివాసరావును క్షణాల వ్యవధిలోని పట్టుకున్నారు.
ఇటీవల సంధ్యారాణి శ్రీనివాసరావును ఓ మహిళ విషయంలో నిలదీసినట్టు తెలుస్తోంది. సంధ్యారాణి తో కాకుండా మరొక మహిళతో శ్రీనివాసరావు అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై సంధ్యారాణి శ్రీనివాసరావు తో గొడవ పడినట్టు సమాచారం. ఆ గొడవలోనే ఇద్దరి మధ్య మాటలు పెరిగాయని స్థానికులు అంటున్నారు. సంధ్యారాణి తనను తిట్టడాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరావు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని సమాచారం. అయితే ఆ ఇద్దరు కవల పిల్లలకు ఎవరూ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు ఆ పిల్లల్ని తండ్రి వద్దకు పంపించే ప్రయత్నాన్ని పోలీసులు చేపట్టారు. ప్రస్తుతం ఆ పిల్లలకు పోలీసులు తాత్కాలిక వసతి కల్పించారు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తామని పోలీసులు అంటున్నారు.