Afghanistan Vs Papua New Guinea: టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం నమోదు చేసింది. వరుస గెలుపులతో సూపర్ -8 కు అర్హత సాధించింది. శుక్రవారం ట్రినిడాడ్ టొబాగో వేదికగా పపువా న్యూ గినియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.. దీంతో తదుపరి దశకు లైన్ క్లియర్ చేసుకుంది. గ్రూప్ – బీ లో ఆఫ్ఘనిస్తాన్.. ఆడిన మూడు మ్యాచ్ లలో మూడు గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. వెస్టిండీస్ జట్టుతో కలిసి తమ గ్రూపు నుంచి తదుపరి దశకు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.5 ఓవర్లలో 95 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. కిప్లిన్ 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫజల్లా ఫారూకీ మూడు వికెట్లు పడగొట్టాడు.. నవీనుల్ రెండు వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్ ఒక వికెట్ సాధించాడు. పపువా న్యూ గినియా జట్టులో నలుగురు బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు.. టాస్ ఓడిపోయిన ఈ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని.. 17 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ టోనీ 11 పరుగులు చేసి ఊపు మీద కనిపించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 50 పరుగులకే 7 వికెట్లు నష్టపోయి తీవ్రమైన కష్టాల్లో పడింది. ఈ దశలో అలేయ్ 13 పరుగులతో ఆకట్టుకున్నాడు.. అనంతరం ఈ లక్ష్యాన్ని ఆఫ్గనిస్తాన్ 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
గుల్బాదిన్ నైబ్ 49* ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఎదుట స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. అనుకున్నంత ఈజీగా ఇన్నింగ్స్ సాగలేదు. ఓపెనర్ ఇబ్రహీం గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ గుర్బాజ్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో గుల్బాదిన్, అజ్మతుల్లా (13), మహమ్మద్ నబీ (16*) స్కోర్ బోర్డును ముందుకు నడిపించి.. ఆఫ్ఘనిస్తాన్ జట్టును విజయపథంలో నడిపించారు. ఆఫ్ఘనిస్తాన్ ఈ విజయ సాధించడం ద్వారా న్యూజిలాండ్ సూపర్ -8 అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి.
ఈ విజయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్ కూడా ఆరు పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్లు ఆడిన మూడు మ్యాచ్లలో.. మూడింటిలోనూ నెగ్గాయి.. మరోవైపు న్యూజిలాండ్ రెండు మ్యాచ్లు ఆడి.. రెండిట్లోనూ ఓడిపోయింది.. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో -2.425 నెగిటివ్ రన్ రేట్ ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక శుక్రవారం ఉగాండా జట్టుతో, సోమవారం పపువా న్యూ గినియా జట్టుతో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్ భారీ తేడాతో గెలిచినప్పటికీ ఉపయోగముండదు. ఆ జట్టు ఖాతాలో గరిష్టంగా నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు 6 పాయింట్లు సాధించి తొలి రెండు స్థానాలలో కొనసాగుతున్నాయి. అయితే న్యూజిలాండ్ జట్టుకు మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సూపర్ -8 దారులు ముగుసుకుపోవడం విశేషం.. ఐసీసీ నిర్వహించిన మెగాటోర్నీలలో న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లడం చరిత్రలో ఇదే మొదటిసారి.