Nangeyalia Kharote : త్వరలో ఐపీఎల్ 2025 వేలం జరగనుంది.. ఇప్పటికే ఆయా జట్ల యాజమాన్యాలు రిటైన్డ్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేశాయి. కొనుగోలు చేసే ఆటగాళ్లపై ఒక స్పష్టతకు వచ్చాయి. అయితే ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నంగేయాలియా ఖరోటే. రషీద్ ఖాన్ తర్వాత ఆఫ్గనిస్తాన్ జట్టులో ఆ స్థాయి ప్రదర్శన చూపగల సత్తా ఈ బౌలర్ సొంతం. ప్రస్తుతం ఇతడు దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో అదరగొడుతున్నాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండు వన్డే మ్యాచ్లలో అదరగొట్టాడు. ముఖ్యంగా రెండవ వన్డేలో దక్షిణాఫ్రికా 177 పరుగుల భారీ తేడాతో ఆఫ్గానిస్థాన్ పై ఓడిపోవడం వెనుక ముఖ్య పాత్ర పోషించాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇది తొలి అంతర్జాతీయ సిరీస్ విజయం. సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటే ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. రషీద్ ఖాన్ 13 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ నంగేయాలియా ఖరోటే 6.2 ఓవర్లు బౌలింగ్ వేసి, 26 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
నంగేయాలియా ఖరోటే నేపథ్యం ఏంటంటే..
నంగేయాలియా ఖరోటే ఏప్రిల్ 25, 2004 లో జన్మించాడు. ఇతడు ఎడమ చేతి స్పిన్ బౌలింగ్ వేస్తాడు. ఇతడు ఐపీఎల్ లో ఎక్కువ ధరకు పోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ కు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై ప్రముఖంగా దృష్టి సారించాయి.. ఈ జట్టుకు చెందిన రషీద్ ఖాన్, అహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, నూర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ లో సత్తా చాటుతున్నారు. అయితే వీరి తర్వాత వచ్చే వేలంలో అతిపెద్ద కొనుగోలు నంగేయాలియా ఖరోటే దే కావచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ నిర్వహించే భారత మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. నంగేయాలియా ఖరోటే ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్. అతడిని కొనుగోలు చేయడానికి కోల్ కతా, హైదరాబాద్, గుజరాత్, పంజాబ్ జట్లు అత్యంత ఉత్సాహంగా ఉన్నాయి. ఇతడిని కొనుగోలు చేయడానికి పై జట్లు పోటీ పడితే స్టార్క్ రికార్డును అతడు బ్రేక్ చేయడం గ్యారెంటీ అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, నాలుగు వికెట్లు తీసిన అనంతరం నంగేయాలియా ఖరోటే.. తన ప్రదర్శన పై హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు గెలుపొందడం పట్ల గర్వంగా ఉందని వ్యాఖ్యానించాడు.