Tirumala Laddu Controvercy : టీటీడీ ట్రస్ట్ బోర్డు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం టిటిడి ట్రస్ట్ బోర్డును నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నియమితులయ్యారు. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.ఆయన కుమారుడికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. అందుకే కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ గా అవకాశమిచ్చారు. 17 సంవత్సరాల కిందట రాజశేఖర్ రెడ్డి హయాంలో కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా పదవి చేపట్టారు. అందుకే సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకొని ఆయన నియామకం చేపట్టారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైవి సుబ్బారెడ్డిని చైర్మన్ గా నియమించారు జగన్. తొలి నాలుగు సంవత్సరాలు ఆయనే పదవి బాధ్యతలు చేపట్టారు. చివరి ఏడాది మాత్రం కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.ఆ ఇద్దరి హయాంలోనే టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహారాలు నడిచాయన్నది ప్రధాన ఆరోపణ.
*వంద రోజులు అవుతున్నా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంతవరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులను ఎంపిక చేయలేదు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. తొలుత మెగా బ్రదర్ నాగబాబు, సినీ నిర్మాత అశ్విని దత్ పేర్లు బలంగా వినిపించాయి. మరోవైపు నిర్మాత, నటుడు, సీనియర్ ఎంపీ మురళీమోహన్ సైతం ఆ పదవిని ఆశించారు. ఇంకోవైపు ఓ మీడియా ఛానల్ అధినేత పేరు బలంగా వినిపించింది. కానీ ఇంతవరకు నియామకాలు జరగలేదు. నామినేటెడ్ పోస్టులతో పార్టీ టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం ఉంటుందని తాజాగా తెలుస్తోంది.
* బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
వచ్చే నెల నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. లక్షలాదిమంది భక్తులు హాజరవుతారు. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇటువంటి సమయంలో ట్రస్ట్ బోర్డు పాత్ర కీలకం. అయినా సరే నియామకం విషయంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. ఇప్పటికే సమర్థులైన అధికారులను జేఈవో, అదనపు జేఈవోలుగా నియమించారు. వారే ఏర్పాట్లు చేస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా సరే ట్రస్ట్ బోర్డు లేకపోయినా లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
*భక్తులకు భరోసా ఏది
తాజాగా శ్రీవారి లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఇటువంటి సమయంలో భక్తులకు భరోసా కల్పించేలా టీటీడీ వ్యవహరించాల్సి ఉంది. కానీ నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చించారు. ప్రధాన అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చిస్తున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి సైతం హాజరయ్యారు.