Aaron George: పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ గా అతడు తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అంతకుముందు కూడా కొన్ని మ్యాచ్లలో అతడు ఆకట్టుకోలేకపోయాడు. వైభవ్ సూర్య వంశీ ప్రభ ముందు అతడు వెలవెలబోయాడు. ఈ నేపథ్యంలో అతనికి బదులుగా మరొక ఆటగాడిని ఓపెనర్ గా తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి.
మేనేజ్మెంట్ ఆరోన్ జార్జ్ మీద పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా అతడినే ఓపెనర్ గా బరిలో దింపింది. గత మ్యాచ్లో మాదిరిగానే జార్జ్.. ఈ మ్యాచ్ లో కూడా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఓ ఎండ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను వైభవ్ సూర్య వంశీ ఉతికి ఆరేస్తుంటే.. జార్జ్ మాత్రం సమర్థవంతంగా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను మాత్రమే శిక్షించాడు. కఠినమైన బంతులను నాకెందుకులే అన్నట్టుగా వదిలేశాడు. అది జట్టుకు చాలా లాభాన్ని చేకూర్చింది.
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ఆరోన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తొలి వికెట్ కు వైభవ్ సూర్య వంశీ తో కలిసి తొలి వికెట్ కు 90 , ఆయుష్ మాత్రే తో కలిసి రెండో వికెట్ కు 114, విహాన్ తో కలిసి మూడో వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశాడు. తద్వారా టీమిండియా ఏ స్థితిలో కూడా ఓడిపోయే పరిస్థితిని జార్జ్ కల్పించలేదు.
ఈ మ్యాచ్లో వీరోచితమైన సెంచరీ చేసిన నేపథ్యంలో మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని జార్జ్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.” నా నమ్మకమే నిజమైంది. నాకు జట్టును గెలిపించే అవకాశం లభించింది. దీనికి నేను చాలా కృతజ్ఞుడను. జట్టు విజయం సాధించాలంటే కీలకమైన ఇన్నింగ్స్ ఆడాలి. అది నా ద్వారా సాధ్యమైంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను మొదట్లో పరీక్షించాను. ఆ తర్వాత సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. నా బ్యాటింగ్ మీద నేను పూర్తిస్థాయిలో నమ్మకాన్ని ఉంచాను. నేను మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో సమర్థతతో బ్యాటింగ్ చేశారు. ఇదే జోరు ఫైనల్ మ్యాచ్లో కూడా కొనసాగిస్తామని ఆశిస్తున్నానని” జార్జ్ వ్యాఖ్యానించాడు.