Ravindra Jadeja Retirement: 2026 క్రికెట్ సీజన్ ను టీమిండియా విజయంతో మొదలుపెట్టింది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ గెలుపు సాధించింది. రెండవ వన్డేలో ఓడిపోయింది. టీమిండియా సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆదివారం జరిగే మూడో వన్డేలో విజయం సాధించాలి. అప్పుడే సిరీస్ టీమ్ ఇండియా సొంతం అవుతుంది.
గిల్ నాయకత్వంలో ఆడుతున్న టీమ్ ఇండియా ఎట్టి పరిస్థితుల్లో సిరీస్ కోల్పోవద్దని బలమైన నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే జట్టులో ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. బౌలింగ్ లోపాలు రెండవ వన్డేలో బయటపడిన నేపథ్యంలో.. వాటిని సవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా జరుగుతుండగానే టీమ్ ఇండియాకు సంబంధించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రవీంద్ర జడేజా తన కెరియర్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి.
వైట్ బాల్ ఫార్మాట్లో రవీంద్ర జడేజాకు మంచి రికార్డు ఉంది. టి20, పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో అతడు అద్భుతమైన రికార్డులను అందుకున్నాడు. టీమిండియా సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. అటువంటి రవీంద్ర జడేజా వైట్ బాల్ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అతడు స్థిరమైన సామర్థ్యాన్ని కొనసాగించలేకపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ జట్టుతో జరిగే చివరి వన్డే తర్వాత అతడు ఈ నిర్ణయం ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది.
రవీంద్ర జడేజా చాలా సంవత్సరాలుగా టీమిండియా కు ఆడుతున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్పిన్ బౌలింగ్ ద్వారా టీమిండియా కు ఎన్నో విజయాలు అందించాడు. బ్యాటింగ్ ద్వారా కూడా మెరుగైన భాగస్వామ్యాలను నిర్మించాడు. ఫీల్డింగ్ విషయంలో కూడా అతడు అదే స్థాయిలో ప్రమాణాలను నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్న క్రమంలో.. వైట్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని అతడు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టి20 ఫార్మేట్ నుంచి విరాట్, రోహిత్ తప్పుకున్నారు. రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి కూడా వారు రిటర్మెంట్ ప్రకటించారు. వైట్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత కొంతకాలం పాటు రెడ్ ఫార్మేట్ లో కొనసాగాలని జడేజా భావిస్తున్నట్టు తెలుస్తోంది.