Pakistan Cricket Board: ఒరే అజామూ.. నీపై వేటు తప్పదురోయ్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

వరుస వైఫల్యాలు.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. బంగ్లాదేశ్ జట్టుతో వైట్ వాష్ ఓటమి.. ఇన్ని ప్రతికూల ఫలితాల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిద్ర మేల్కొంది. వరుస వైఫల్యాలతో విమర్శలు వ్యక్తమౌతున్న తరుణంలో ప్రక్షాళన మొదలుపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 7, 2024 4:35 pm

Pakistan Cricket Board

Follow us on

Pakistan Cricket Board: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రక్షాళనలో భాగంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవలి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు అంతర్గతంగా చర్చించుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గత వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఆ సమయంలో జట్టు వైఫల్యానికి తానే కారణమని చెబుతూ అజామ్ సారధ్య బాధ్యత నుంచి తప్పుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి అతడు వైదొలిగాడు.. అయితే ఇటీవల టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు అజామ్ కు మళ్లీ జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ పాకిస్తాన్ ఆట తీరు మారలేదు. గ్రూప్ దశ నుంచే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టుతో గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓటమిపాలైంది. చివరికి అమెరికా చేతులోనూ పరాజయం పాలైంది. చివరికి స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది. దీంతో జట్టు ప్రక్షాళనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడుం బిగించింది. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయింది.

అతడు కారణం కాకపోయినప్పటికీ..

వాస్తవానికి ఇటీవల పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయేందుకు అజామ్ కారణం కాకపోయినప్పటికీ.. అతడికి టెస్ట్ కెప్టెన్ హోదా లేకపోయినప్పటికీ.. అతడి పేలవ ఫామ్, జట్టులో జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. టి20, వన్డేలకు కొత్త కెప్టెన్ ను నియమించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఆలోగా బలమైన జట్టును నిర్మించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో బాబర్ స్థానంలో రిజ్వాన్ కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించనుందని సమాచారం.

ఆస్ట్రేలియా పర్యటన నాటికి కొత్త సారథి

వన్డే వరల్డ్ కప్ లో దారుణమైన వైఫల్యం తర్వాత షాహిన్ ఆఫ్రిదికి జట్టు టీ -20 పగ్గాలు అప్పగించారు. అతడికి కేవలం న్యూజిలాండ్ సిరీస్ వరకే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బాబర్ ను మళ్లీ కెప్టెన్ గా నియమించారు. ఈ క్రమంలో జట్టులో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అది గొడవలుగా మారాయి. కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో జట్టులో ఆటగాళ్ల మధ్య సయోధ్య లేదని.. ఐక్యత కనిపించడం లేదని అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలు ప్రసారమయ్యాయి. ఇన్ని పరిణామాల మధ్య జట్టుకు కొత్త నాయకుడిని నియమించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.. వచ్చే నవంబర్లో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఆ సమయానికల్లా పాకిస్తాన్ జట్టు కు కొత్త సారధి రాబోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ 3 వన్డేలు, మూడు టి20 లు ఆడుతుంది.