FIFA World Cup 2022 : 32 జట్ల సమరం: ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సమరం మామూలుగా లేదు

FIFA World Cup 2022 : సాకర్.. అలియాస్ ఫిఫా వరల్డ్ ఫుట్ బాల్ కప్.. నెల రోజులపాటు సందడి ఉంటుంది.. 32 జట్లు హోరాహోరీగా పాల్గొంటాయి.. వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది.. కోట్లాదిమంది ప్రేక్షకులు 90 నిమిషాల పాటు జరిగే మ్యాచ్ ను రెప్పవాల్చకుండా చూస్తారు. విజిల్ శబ్దం వినిపించడమే ఆలస్యం… మైదానం మొత్తం సాకర్ నామస్మరణతో శివాలెత్తుతుంది. ఆడేది 32 జట్లు అయినప్పటికీ.. 200 దేశాలు ఫుట్ బాల్ అంటే చాలా ఆసక్తిని ప్రదర్శిస్తాయి. […]

Written By: Bhaskar, Updated On : November 20, 2022 9:03 am
Follow us on

FIFA World Cup 2022 : సాకర్.. అలియాస్ ఫిఫా వరల్డ్ ఫుట్ బాల్ కప్.. నెల రోజులపాటు సందడి ఉంటుంది.. 32 జట్లు హోరాహోరీగా పాల్గొంటాయి.. వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది.. కోట్లాదిమంది ప్రేక్షకులు 90 నిమిషాల పాటు జరిగే మ్యాచ్ ను రెప్పవాల్చకుండా చూస్తారు. విజిల్ శబ్దం వినిపించడమే ఆలస్యం… మైదానం మొత్తం సాకర్ నామస్మరణతో శివాలెత్తుతుంది. ఆడేది 32 జట్లు అయినప్పటికీ.. 200 దేశాలు ఫుట్ బాల్ అంటే చాలా ఆసక్తిని ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం ఖతార్ దేశంలో ఫిఫా కప్ జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి 10 లక్షల మందికి పైగా విదేశీ యాత్రికులు వస్తారని ఒక అంచనా.. ఇప్పటికే నెల రోజులకు సరిపడా హోటళ్ళ రూములు బుక్ అయ్యాయి. దేశ విదేశాల నుంచి చెఫ్ లు కూడా వచ్చారు. ఖతార్ ముస్లిం దేశం కావడంతో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా స్టేడియంలో బీర్ల అమ్మకాలను నిషేధించారు.. నాన్ ఆల్కహాలిక్ బీర్లకు పచ్చ జెండా ఊపారు. ఆతిథ్యం వరకు బాగానే ఉన్నా ఖతార్ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటోంది. కొన్ని దశాబ్దాల్లో ఏ ప్రపంచ కప్ కూ లేని వ్యతిరేకత ఈ టోర్నీ విషయంలో ఎదురవుతున్నది. ఎప్పుడు కూడా జూన్- జూలై నెలలో టోర్నీ జరుగుతుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నవంబర్- డిసెంబర్ నెల కు వాయిదా వేయడం పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది..ఖతార్ దేశం అభిమానుల వస్త్రధారణ పై కూడా తీవ్ర ఆంక్షలు విధించింది. మైదానాల నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ… స్టేడియాల నిర్మాణంలో తగు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల చాలా మంది కార్మికులు చనిపోయారు. దీనిపై స్థానికుల్లో నిరసన వ్యక్తం అయింది.

 

28 రోజులే

ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్ సాధారణంగా నెలకు పైగా ఉంటుంది. ఈసారి 28 రోజుల్లో ముగుస్తుంది. అతి తక్కువ రోజుల్లో నిర్వహించడం ఇదే తొలిసారి. ఖతార్ ఎడారి దేశం కావడంతో వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే టోర్నీ షెడ్యూల్ శీతాకాలానికి మార్చారు. ఫిఫా చరిత్రలో తొలి శీతాకాలపు టోర్నీగా దీనిని చెప్పవచ్చు. సాధారణంగా అయితే ఫుట్ బాల్ ప్రపంచకప్ పోటీలను మే నుంచి జూలై మధ్యలో నిర్వహిస్తారు. ఖతార్ ఎడారి దేశం కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. పగటిపుట పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. అందుకే ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏకంగా స్టేడియాల్లో సెంట్రల్ ఏసీ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఇక ఈ టోర్నీ నిర్వహణ కోసం ఖతార్ ఏకంగా 200 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. కొత్తగా ఏడు మైదానాలు నిర్మించింది. ఒక మైదానాన్ని ఆధునీకరించింది. హోటల్స్, రహదారులు నిర్మించింది. 32 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఎనిమిది స్టేడియాల్లో 64 మ్యాచులు నిర్వహిస్తారు. ఫిఫా తొలి ప్రపంచ కప్ పోటీలు 1930 లో ఉరుగ్వే వేదికగా జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయం మినహాయిస్తే ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ పోటీలు జరుగుతున్నాయి.. గత ప్రపంచకప్ లో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో క్రొయేషియా ను 4_2 తేడాతో ఓడించి కప్ గెలుచుకుంది. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో బ్రెజిల్ ఐదు, జర్మనీ నాలుగు, ఇటలీ నాలుగు, అర్జెంటీనా రెండు, ఫ్రాన్స్ రెండు, ఉరుగ్వే రెండు, స్పెయిన్ ఒకటి, ఇంగ్లాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి.

అరబ్ దేశాల్లో తొలిసారి

ఫిఫా వరల్డ్ కప్ జరగడం అరబ్ దేశాల్లో ఇదే మొదటిసారి. ఆసియా ఖండంలో ఇది రెండోసారి.. గతంలో అంటే 2002లో జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా టోర్నీ నిర్వహించాయి. 90 నిమిషాల పాటు జరిగే ఫుట్బాల్ మ్యాచ్లో కోట్లాది రూపాయల బెట్టింగులు జరుగుతాయి. గత ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టుపై 100 కోట్ల రూపాయల బెట్టింగ్లు జరిగాయి.. ఈసారి బ్రెజిల్ ఫేవరెట్ జట్టుగా ఉండటంతో వెయ్యి కోట్ల వరకు బెట్టింగ్ జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.. ఆ తర్వాత స్థానం అర్జెంటీనాకు ఉంది.