20 Runs off One Ball: పరిమిత ఓవర్ల ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్లో గొప్ప గొప్ప రికార్డులు నమోదు అవుతున్నాయి. పాత రికార్డులు తేలిపోతున్నాయి. కొత్త కొత్త ఆటగాళ్లు తెరపైకి వస్తున్నారు. క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారుతున్నారు. అలాంటి సంచలన ఆటగాళ్లల్లో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ రుమారియో షెఫర్డ్ ఒకడు. ప్రస్తుతం అతడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.
షెఫర్డ్ గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్ లో భాగంగా సెయింట్ లూసియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇతడు సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం ఒకే ఒక బంతి ఎదుర్కొని 20 పరుగులు చేశాడు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భాగంగా 15 ఓవర్లో లూసియా బౌలర్ థామస్ వేసిన మూడో బంతి నో బాల్ అయింది. అయితే ఈ బంతికి షెఫర్డ్ ఒక్క పరుగు కూడా తీయలేదు. అయితే ఫ్రీ హిట్ గా చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ బంతిని భారీ సిక్సర్ కొట్టాడు. అయితే ఫ్రీ హిట్ కూడా నోబాల్ అయింది. అయితే ఆ బంతిని షెఫర్డ్ బౌండరీ లైన్ అవతలకు కొట్టాడు. అయితే ఆ బంతి కూడా నోబాల్ అయింది. దీంతో మూడవ ఫ్రీ హిట్ ను కూడా షెఫర్డ్ సద్వినియోగం చేసుకున్నాడు. దానిని భారీ సిక్సర్ కొట్టాడు. ఫలితంగా ఒకే ఒక్క బంతికి 20 పరుగులు వచ్చినట్టుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షెఫర్డ్ 73 పరుగులు చేశాడు. ఇందులో ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే అతడు 34 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
షెఫర్డ్ ఐపీఎల్ లో కన్నడ జట్టు తరుపున ఆడుతున్నాడు.. ఇటీవల జరిగిన ఐపీఎల్లో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం పద్నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని అతడు అర్థ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఐపీఎల్ లో 13 బంతుల్లోనే అర్థ శతకం చేసిన రికార్డు రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్ పేరు మీద ఉంది. ఈ జాబితాలో జైస్వాల్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో షెఫర్డ్ ఉన్నాడు. ఇటీవలి ఐపిఎల్ లో షెఫర్డ్ మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు షెఫర్డ్.. అయితే వచ్చే సీజన్లో కూడా కన్నడ జట్టు అతడిని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.