Idugunji Ganapati Temple: వినాయకుడు కష్టాలు తీరుస్తాడు. కన్నీళ్లను దూరం చేస్తాడు.. శుభాలను ప్రసాదిస్తాడు. వరాలను కురిపిస్తాడు. అంతేకాదు పెళ్లిళ్లు కూడా కుదుర్చుతాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమే ఇక్కడ కొలువై ఉన్న గణపతి పెళ్లి కాని వారికి వివాహ యోగాన్ని ప్రసాదిస్తాడు.
దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలోని హోన్నావర తాలూకాలో ఇడుగుంజి గణపతి ఆలయం ఉంది. కర్ణాటకలో ప్రముఖ శవక్షతరంగా పేరుపొందిన గోకర్ణం కు ఈ ఆలయం సమీపంలో ఉంటుంది. స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే వివాహం కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.. ఈ ఆలయంలో గణపతి విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది. స్వామివారికి ఒక చేతిలో పద్మం ఉంటుంది. మరో చేతిలో లడ్డు కనిపిస్తుంది. మెడలో చిన్నపాటి పూలమాలతో మాత్రమే స్వామి వారు దర్శనమిస్తారు. ఎటువంటి ఆడంబరాలు.. అలంకారాలు కనిపించవు.. గణపతి విగ్రహం కింద ఎలుక అనేది సర్వసాధారణం. అయితే ఈ ఆలయంలో మూషికం కనిపించదు.
స్థల పురాణం ఎలాంటిదంటే
పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో వాలిక్యుడు అనే ఋషి యజ్ఞ యాగాదులు నిర్వహించడానికి సిద్ధమవుతాడు. ఈ ప్రాంతంలో గతంలో త్రిమూర్తులు వారి రాక్షస సంహారం చేస్తారు. ఈ విషయాన్ని నారదుడు చెప్పడంతో వాలిక్యుడు యజ్ఞం నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా భావిస్తాడు.. అయితే యజ్ఞం నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ ఆటంకాలు ఎదురవుతుంటాయి. దీంతో ఆ కష్టాలు తీర్చాలని నారదుడిని వాలిక్యుడు వేడుకుంటాడు. దీంతో ఆయనే స్వయంగా వచ్చి.. గణపతిని వెంట తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఆ తర్వాత యజ్ఞం నిరాటంకంగా సాగుతుంది. గణపతి స్వయంగా ఇక్కడికి రావడంతో స్వయంభుగా ఇక్కడ వెలిశాడు.
కర్ణాటక రాష్ట్రంలోని బంది అని తెగవారు తమ ఇంట్లో వివాహం నిర్ణయం కాగానే.. ఈ ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి పాదాల పక్కన రెండు చీటీలో ఉంచుతారు. ఒకవేళ చీటీ కుడి కాలు దగ్గర ఉన్న ప్రాంతంలో పడితే దానిని గొప్ప విషయంగా భావిస్తుంటారు. ఒకవేళ ఎడమ కాల మీద పడితే మాత్రం మరో సంబంధాన్ని వెతుక్కుంటారు. స్వామివారి ఆలయాన్ని ప్రతి ఏడాది పది లక్షల మందికిపైగా దర్శించుకుంటారు.. ఈ ఆలయం మంగళూరు నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఉడిపి జిల్లాలోని బ్రాహ్మవర్ పట్టణం దాటిన తర్వాత సిరియారా అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది.