World Cup – Betting : దేశ క్రీడా రంగంలో అక్రమ పందాలు (బెట్టింగ్), జూదం (గ్యాంబ్లింగ్) జోరుగా సాగుతోంది. ఇందులో ఎక్కువ భాగం క్రికెట్‌పైనే జరుగుతున్నట్టు ‘థింక్ ఛేంజ్ ఫోరం’ (టీసీఎఫ్) అనే సంస్థ తెలిపింది. క్రీడా రంగంలో జరుగుతున్న ఈ అక్రమ దందాలోకి ఏటా రూ.8.20 లక్షల కోట్ల నిధులు ప్రవహిస్తున్నాయి. చట్టపరంగా నమోదైన బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలపై ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఈ పన్ను ఎగవేసేందుకు విదేశాల్లో నమోదైన వెబ్‌సైట్ల ద్వారా అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏటా రూ.2,29,600 కోట్ల జీఎస్టీ ఆదాయం నష్టపోతోందని టీసీఎఫ్ నివేదిక వెల్లడించింది.
టాస్క్‌ఫోర్స్‌తో చెక్
ఈ అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ దందాకు తోడ్పడే విదేశీ వెబ్‌సైట్లపై నిఘా వేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం, అవి భారత్‌లోనూ నమోదయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ అక్రమ దందాకు చెక్‌పెట్ట వచ్చని టీసీఎఫ్ తెలిపింది. లేకపోతే చట్టపరంగా జరుగుతున్న బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు కూడా.. విదేశాల నుంచి జరుగుతున్న అక్రమ వెబ్‌సైట్లకు తరలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బెట్టింగ్‌లో 14 కోట్ల మంది: అక్రమంగా లేదా సక్రమంగా జరిగే స్పోర్ట్స్ బెట్టింగ్‌లో పెద్ద సంఖ్యలోనే ప్రజలు పాల్గొంటున్నారు. వీరి సంఖ్య సాధారణ రోజుల్లో 14 కోట్లు ఉంటే, ఐపీఎల్ వంటి సమయాల్లో 37 కోట్ల మంది వరకు ఉంటోందని టీసీఎఫ్ అంచనా. ఈ అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ద్వారా చేతులు మారే నిధులు హవాలా, క్రిప్టోకరెన్సీలు, ఇతర అక్రమ మార్గాల ద్వారా ఆయా వ్యక్తులకు చేరుతోంది. ఇది దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కూడా ముప్పు తెచ్చిపెడుతుందని టీసీఎఫ్ హెచ్చరించింది.
కాగా, క్రికెట్ ప్రపంచ కప్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు రూ.18,000 కోట్ల నుంచి రూ.22,000 కోట్ల వరకు లబ్ది చేకూరనుందని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఆర్థికవేత్తలు అంచనా వేశారు. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి భారత్‌లో జరుగుతోంది. ప్రపంచ కప్‌కు భారత్ వేదిక కావడం 2011 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ లు నవంబరు 19 వరకు కొనసాగనున్నాయి. దేశంలోని 10 నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. దాంతో పర్యాటక, ఆతిథ్య రంగాలకు ప్రధానంగా లబ్ది చేకూరనుందని.. మ్యాచ్‌లు జరిగే నగరాలకు దేశీయ, విదేశీ పర్యాటకులు భారీ సంఖ్యలో ప్రయాణించనున్నారని మా బీఓబీ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పండగ సీజన్‌లో ఈ టోర్నీ జరుగుతుండటంతో రిటైల్ రంగానికి కూడా ప్రయోజనకరం కానుందని, కేంద్ర ప్రభుత్వానికి పరోక్ష పన్నుల ఆదాయం మరింత పుంజుకోనుందన్నారు. అయితే, ఈ కాలానికి విమాన చార్జీలు, హోటల్ గదుల అద్దెలు పెరుగుదలతో అక్టోబరు-నవంబరులో ద్రవ్యోల్బణం కూడా 0.15 శాతం నుంచి 0.25 శాతం పెరగవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.