SRH, IPL 2021 : కరోనా సెకండ్ వేవ్ కారణంగా అర్ధంతరంగా రద్దైపోయిన ఐపీఎల్- 2021 సీజన్ ను దుబాయ్ లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 19 నుంచి టోర్నీ రెండో విడత మొదలు కానుంది. అయితే.. ఆరంభానికి ముందు మరోసారి కరోనా కలకలం రేగింది. దీంతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మిగిలిన పలు జట్ల ఆటగాళ్లు కూడా దుబాయ్ ఐపీఎల్ ఆడట్లేదని ప్రకటించారు.
ప్రశాంతంగా సాగుతున్న క్రికెట్ ప్రపంచంలో మరోసారి కరోనా చిచ్చు పెట్టింది. ఇంగ్లండ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య కొనసాగుతున్న టెస్టు సిరీస్ లో కరోనా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఐదో టెస్టు ఆరంభానికి ముందే.. పలువురు భారత టీమ్ మెంబర్లు కరోనా బారిన పడ్డారు. హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు ఫిజియో తదితరులు కరోనా పాజిటివ్ అయ్యారు. దీంతో.. ఆటగాళ్లకూ పాకి ఉంటుందనే టెన్షన్ మొదలైంది. వారందరికీ టెస్టు చేయగా.. నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ.. మ్యాచ్ మొదలైన తర్వాత కరోనా బయటపడొచ్చనే అనుమానంతో ఐదో టెస్టును రద్దు చేశారు.
ఇదిలాఉంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ కోసం దుబాయ్ బయలుదేరాల్సి ఉంది. దీంతో.. కరోనా సోకే అవకాశం ఉండొచ్చనే భయంతో పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ను వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీంతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ బెయిర్ స్టో ఈ సీజన్ లో ఆడట్లేదని తెలిపాడు. అతనితోపాటు పంజాబ్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఢిల్లీ ప్లేయర్ క్రిస్ వోక్స్ కూడా ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
దుబాయ్ వెళ్లిన తర్వాత వారం రోజులపాటు కఠిన క్వారంటైన్ పాటించాల్సి ఉంది. ఈ కారణంతోనే వీరు వైదొలిగినట్టు సమాచారం. దీంతోపాటు కొవిడ్ సోకితే.. అదొక ఇబ్బంది ఎందుకని భావించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆరంభం కాకముందే.. రెండో దశ పోటీల్లో కరోనా కలకలం రేపింది. మరి, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి.