లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన జట్టు.. సెమీ ఫైనల్ కు చేరుతుందా? దాదాపుగా అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేసింది భారత మహిళా హాకీ టీమ్. ఇవాళ సెమీస్ పోరుకు సిద్ధమైంది. తద్వారా పతకానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో గనక గెలిస్తే.. పతకం ఖాయం చేసుకుంటుంది మహిళా జట్టు. ఇక, ఇదే రోజు మరో అద్భుత ఘట్టం కూడా ఉంది. ఇప్పటికే కనీసం కాంస్యాన్ని ఖరారు చేసుకున్న మహిళా బాక్సర్ లవ్లీనా.. రజత, పసిడి పతకాల కోసం పంచ్ లు విసరబోతోంది. మరి, ఈ రెండు పోటీల్లో ఎవరు అద్భుతం సృష్టించబోతున్నారు? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
భారత మహిళా బాక్సర్ లవ్లీనా అద్భుతమైన విజయాలతో సెమీ ఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ చాంపియన్ అయిన చిన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది. తద్వారా.. భారత్ కు కనీసం కాంస్యాన్ని ఖాయం చేసింది. బుధవారం జరగనున్న బౌట్ లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ బుసానెజ్ ను ఢీకొట్టబోతోంది. ఇది అత్యంత కఠినమైన సవాల్. వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న బుసానెజ్ ను ఢీకొట్టడం అంత ఈజీకాదు. కానీ.. ఏదీ అసాధ్యం కాదు కదా. అద్భుతమైన ఫామ్ లో ఉన్న లవ్ లీనా ఊహించని పంచ్ ఇచ్చినా ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలో లవ్లీనా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక, పడినా లేచిన కెరటం మాదిరిగా దూసుకెళ్తోంది భారత మహిళా హాకీ జట్టు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడినా.. తేరుకొని సెమీ ఫైనల్ కు చేరడం అద్వితీయ విషయం. క్వార్టర్స్ లో మూడు సార్లు ఒలింపిక్ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి పెను సంచలనం నమోదు చేసింది. ఈ జోరులోనే సెమీస్ లో వరల్డ్ నెంబర్ 2గా ఉన్న అర్జెంటీనాతో పోరుకు సిద్ధమైంది. మరి, పురుషుల జట్టులా వెనుదిరుగుతారా? ఫైనల్ కు చేరి దమ్మెంతో చూపిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
ప్రతిఏడాదీ ఒకే ఒక్క ఒలింపిక్ పతకం కోసం వంద కోట్ల మంది భారతీయులు కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూసే పరిస్థితి ఈ ఏడాది కాస్త తగ్గిందనే చెప్పాలి. మీరాబాయి చాను, సింధు పతకాలు సాధించగా.. లవ్లీనా కూడా పతకం కాయం చేసుకోవడం ఆనందించే విషయం. ఇవాళ్టి పోరులో హాకీ జట్టు గెలిస్తే మరో పతకం ఖాయమవుతుంది. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందన్నది చూడాలి.