Dwarka History: ద్వారక.. ఈ పేరు చెప్పగానే శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తాడు. గుజరాత్ రాష్ట్రం లోని అరేబియా సముద్ర తీరంలో సుమారు 96 చదరపు కిలోమీటర్లలో ఈ నగరం 2500 సంవత్సరాల క్రితం ఉండేది. దీనిని శ్రీకృష్ణుడు నిర్మించాడని చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జరాసంధుడి దాడుల నుంచి రక్షించడానికి విశ్వకర్మ సహాయంతో దీనిని నిర్మించినట్లు చెబుతారు. అత్యంత విలువైన లోహాలు ఈ నగరంలో ఉండేవి. అంతేకాకుండా పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెబుతారు. అయితే మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపం కారణంగా ద్వారక మునిగిపోయిందని అంటుంటారు. ఇదే సమయంలో శ్రీకృష్ణుడు వైకుంఠ ప్రయాణం.. యాదవుల్లో కలహాలు ఏర్పడి ద్వారక మునిగిపోయింది అంటారు. అయితే ఇక్కడే ఒక రోకలి గురించి చెప్పుకుంటున్నారు. రోకలి వల్లే ద్వారక మునిగిపోయిందని అంటున్నారు. ఇంతకీ ఆ రోకలి కథ ఏంటంటే?
యాదవుల యువకుల్లో కొందరు తమ కుల గురువైన విశ్వామిత్రుడు, కణ్వ, నారద మహర్షులను ఆట పట్టించాలని అనుకున్నారు. వీళ్లు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడిని ఆడవారి విషయంలో అలంకరించి గర్భవతి అయినట్లు నటిస్తారు. ఈమెకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పండి అని మహర్షులను అడుగుతారు. మహర్షులు వారి గురించి ముందే తెలుసుకొని కోపంతో మీకు పుట్టబోయే బిడ్డ యాదవ వంశాన్ని నాశనం చేసే ఒక ఇనుప రోకలి అవుతుంది అని శపిస్తారు.
మహర్షుల శాపం నిజమే అయి సాంబుడు ఒక రోకలిని కంటాడు. అయితే యాదవులు భయపడి ఆ రోకలిని అరగదీసి.. పొడిచేసి సముద్రంలో పడేస్తారు. ఆ పొడి సముద్రపు ఒడ్డున పడి గరిక రూపంలో పెరుగుతుంది. ఆ గరికలో ఒక భాగం మిగిలిపోయి ఒక చేప నోటిలో పడుతుంది. ఆ చేపను ఒక వేటగాడు పట్టుకుంటాడు. ఆ చేపలోని ఇనుప ముక్కలు వేటగాడు తన బాణానికి అమర్చుకుంటాడు. ఆ తర్వాత యాదవుల మధ్య ఘర్షణ పెరిగి సముద్రపు ఒడ్డున ఉన్న అదే గరికతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు. ఈ సమయంలో శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. వేటగాడు జింక అనుకొని శ్రీకృష్ణుడిపై తాను చేపకడుపులో ఉన్న ఇనుప ముక్కతో తయారుచేసిన బాణం ను వేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మరణిస్తాడు.
ఇలా ఒక రోకలి వల్ల ద్వారక నగరం మొత్తం నాశనం అవుతుంది. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం సోమనాథ్, ద్వారకాతీరంలో సముద్రంలో మునిగిన ప్రాచీన పట్టణ అవశేషాలు దొరికాయి. భూకంపాలు, సముద్ర మట్టం పెరగడంతో భౌగోళిక మార్పు వల్ల ద్వారకానగరం మునిగిందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ ద్వారకా నగరం సుమారు 5000 ఏళ్ల కిందట మునిగిపోయినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. మొత్తంగా ద్వారక చరిత్రలో శాపం, గర్వం, బాణం, సముద్రం అనే నాలుగు ప్రధాన విషయాలు కనిపిస్తాయి. శాపం రోకలిని సూచిస్తుంది. గర్వం యాదవుల వినాశనాన్ని సూచిస్తుండగా.. బాణం శ్రీకృష్ణ అవతారం సమాప్తం చేస్తుంది. సముద్రం ద్వారకం నగరం మునిగేలా చేస్తుంది. అయితే మహాభారతంలో గాంధారి చేసిన శాపంతో నే శ్రీకృష్ణుడు తన వంశాన్ని కోల్పోతాడని మరో పురాణంలో చెబుతున్నారు.