YCP election boycott: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం అయింది. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. చివరిగా ప్రాదేశిక ఎన్నికలు పూర్తి చేయాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్లకుండా ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి రాదు. మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో సమీక్షలు జరిపి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతాయని ఒక అంచనా ఉంది. అయితే ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎటువంటి కదలిక లేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశం ఏంటి అనేది తెలియడం లేదు.
మొన్నటికి మొన్న పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికలు జరిగాయి. పులివెందులలో అయితే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. వాస్తవం చెప్పాలంటే ఉప ఎన్నికల తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అప్పటి టిడిపి ఆరోపించింది. అందుకే అటు తరువాత వచ్చిన ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించింది. ముందుగా పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలుచుకుంది. అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలను కొనసాగించింది. అప్పట్లో ఉన్న వాలంటరీలతో పాటు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంది. వ్యవస్థలన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో విజయం సాధించిందని టిడిపి ఆరోపించింది. అందుకే ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు అడుగు వేస్తోంది. కానీ ఇప్పటికీ పార్టీ నాయకులు యాక్టివ్ కాలేదు. స్థానిక నేతలు పెద్దగా క్రియాశీలకంగా లేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారు. అనవసరంగా పోటీకి దిగి చేతులు కాల్చుకోవడం కంటే దూరంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సైతం కేంద్ర బలగాల పరిధిలో ఎన్నికలు జరగాలని ప్రకటనలు చేస్తోంది. అప్పుడే ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తారని చెబుతోంది. అయితే కేంద్ర బలగాలు లేకపోతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించే ఉద్దేశం కనిపిస్తోంది. అయితే ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఒక ప్రకటన చేసే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.