Akshaya Tritiya 2024: భారతదేశం ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతుంది. ఎన్నో సంప్రదాయాలు ఆచరణలో ఉండగా.. హిందూ సంప్రదాయంలో ఒక్కో పండుగను ఒక్కో విధంగా జరుపుకుంటారు. అటువంటి పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ. అత్యంత విశిష్టత కలిగి ఉన్న ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే ఈ రోజున అసలు బంగారం ఎందుకు కొంటారు? పసిడి కొనుగోలుకు పండుగకు సంబంధం ఏంటి ? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుద్ధ తదియ రోజును ‘అక్షయ తృతీయ’ గా నిర్వహించుకుంటారన్న సంగతి తెలిసిందే. అక్షయ అంటే నాశనం లేనిదని అర్థం. ఈ క్రమంలోనే ఈ రోజున చేసే దానాలు, ధర్మాలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అలాగే అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని దాదాపు ప్రతి ఒక్కరు బంగారాన్ని కొనుగోలు చేస్తారు.
అయితే అక్షయ తృతీయ రోజున చిన్న మొత్తంలో అయినా బంగారం కొనాలని చాలా మంది అంటుంటారు. కానీ ఆ రోజున బంగారం కొనాలని పురాణాల్లో, శాస్త్రాల్లో ఎక్కడా లేదట. అయితే ప్రజలు మాత్రం అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. దీన్నే జ్యువెలరీ షాప్స్ క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఆకర్షణీయమైన ఆఫర్లతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారమేనని పండితులు వివరిస్తున్నారు. కానీ అక్షయ తృతీయ ప్రజలకు ఎంతగా అలవాటు అయిందంటే ఆ రోజున డబ్బులు లేకున్నా కొందరు అప్పులు చేసి మరీ పసిడిని కొనుగోలు చేస్తుంటారు. కానీ బంగారం కొనే బదులు దానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని పండితులు వెల్లడిస్తున్నారు.
అంతేకాదు పురాణాల ప్రకారం.. కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడట. అందులో ఒకటి బంగారం. అందుకే బంగారాన్ని అహంకారానికి హేతువుగా అభివర్ణిస్తారు.ఈ క్రమంలో అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడమంటే.. కలి పురుషుడిని ఇంటిలోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమేనని కొందరు వాదిస్తున్నారు. అందుకే ఈ పర్వదినాన బంగారం కొనడం కాకుండా ఏదైనా దానం చేయాలని సూచిస్తున్నారు.