Wives of Lord Ganesha: పార్వతీ పరమేశ్వరులైన ఆదిదంపతుల ముద్దుల కుమారుడు.. మొదటి పూజ అందుకునే దైవం.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనం ప్రతిరోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఏ పనైనా ప్రారంభిస్తాం. వినాయకుడి పూజ లేకుండా ఏ కార్యక్రమం ప్రారంభం కాదు. అలాంటి దేవదేవుడిని నిత్యం కలవడమే కాకుండా ప్రతి ఏడాది భాద్ర పద మాసంలో వారం రోజులపాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి రాబోతుంది. ఈ సందర్భంగా వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి గురించి చర్చ జరుగుతోంది. వినాయకుడికి ఇద్దరూ భార్యలు ఉన్నారని.. వారు సిద్ధి, బుద్ధి అని కొందరు చెబుతున్నారు. అసలు వినాయకుడికి పెళ్లి ఎప్పుడు అయింది? సిద్ధి,బుద్ధి అంటే ఎవరు?
ఒక మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నా వినాయకుడిని కొలవడం వల్ల వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని కొందరు ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఎంతో నిష్టగా వినాయకుడికి పూజలు చేయడం వల్ల కరుణించి వరాలు కురిపిస్తారని అంటారు. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఆయనకు సిద్ధి, బుద్ధి అనే భార్యలు ఉన్నారని అంటున్నారు.
అయితే సిద్ధి, బుద్ధి గురించి పురాణాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి వినాయకుడు తపస్సు చేసుకుంటుండగా.. అక్కడికి ధర్మ ధ్వజ యువరాణి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని అంటుంది. అందుకు వినాయకుడు కాదంటాడు. దీంతో ధర్మద్వజ రాజపుత్రిక వినాయకుడికి.. నీవు నిత్యం బ్రహ్మచారిగా ఉండు.. అంటూ శాపం పెడుతుంది. దీంతో కోపోద్రిక్తుడైన గణనాథుడు.. ఆమెను దీర్ఘకాలంగా రాక్షసుడి చెంత ఉండమని ప్రతి శాపం ఇస్తాడు. దీంతో ధర్మ ధ్వజ రాజకుమార్తే తనను మన్నించాలని వేడుకోగా.. అప్పుడు వినాయకుడు శాంతించి.. కొంతకాలం రాక్షస చెంత ఉండి ఆ తర్వాత తులసిగా మారాలని చెప్తాడు. అయితే వినాయకుడికి శాపం పెట్టడం వల్ల తులసిని తన పూజలో ఉపయోగించరు.
అయితే గణపతి చర్యకు కొందరు దేవతలు భయపడి బ్రహ్మ దేవుడి వద్దకు వెళ్తారు. దీంతో సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు అమ్మాయిలను సృష్టించారని చెబుతారు. వారిని వివాహం చేసుకున్నాడని అంటారు. కానీ కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్న ప్రకారం.. వినాయకుడు బ్రహ్మచారి అయినందువల్ల ఎవరిని పెళ్లి చేసుకోలేదని.. అయితే సిద్ధి, బుద్ధి అనేవి వినాయకుడి వద్ద ఉంటాయని.. బుద్ధి బాగుంటే సిద్ధి లభిస్తుందని.. ఈ రెండు కావాలంటే వినాయకుడిని పూజించాలని అంటారు. ఈ రెండు వినాయకుడి వద్ద ఉండటం వల్ల వీరిని భార్యలుగా చెబుతున్నారు. వినాయకుడి అనుగ్రహం వల్ల మంచి బుద్ధితోపాటు.. విజయాలు కూడా వరిస్తాయని చెబుతారు.