Sammakka-sarakka : సమ్మక్క-సారక్క పూజారులకు ఏంటీ శాపం.. వాళ్లు ఎందుకు వరుసగా మరణిస్తారు? ఏంటా వ్యథ?

సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో పూజలు పూర్తి ఆదివాసి సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఈ పూజలను సమ్మక్క వంశీయులు నిర్వహిస్తుంటారు. సమ్మక్క - సారలమ్మ కొలువై ఉన్న భరిణెలను చిలుకల గుట్ట నుంచి పూజారులు తీసుకొస్తుంటారు. ఆళ్లపల్లి నుంచి పగిడిద్దరాజు పగిడెలను ఆరం వంశీయులు తీసుకొస్తుంటారు

Written By: Anabothula Bhaskar, Updated On : July 27, 2024 12:43 pm
Follow us on

Sammakka-sarakka : ప్రత్యేకంగా గుడి అంటూ ఉండదు. ఆకర్షణీయంగా దేవతా మూర్తి కనిపించదు. గొప్పగా చెప్పుకోవడానికి ఆలయ ప్రాకారాలు ఉండవు. ఘనతను వివరించేందుకు విశాలమైన నిర్మాణాలు ఉండవు. ఉన్నదల్లా ఒక్కటే నిలువెత్తు భక్తి.. నిలువెత్తు బంగారం ఇస్తే కాపాడుతుందనే నమ్మకం. అమ్మలగన్న అమ్మ.. చల్లగా చూస్తుందనే భరోసా. అందుకనే ఎక్కడో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలంలోని దట్టమైన చిలుకల గుట్ట ప్రాంతంలో కొలువైన సమ్మక్క సారలమ్మకు ఇంతటి ఖ్యాతి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేశం నలుమూలాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మ దగ్గరికి వస్తుంటారు. గద్దలపై ఉన్న అమ్మవార్లను దర్శించుకుని పునీతులవుతుంటారు.

సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో పూజలు పూర్తి ఆదివాసి సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఈ పూజలను సమ్మక్క వంశీయులు నిర్వహిస్తుంటారు. సమ్మక్క – సారలమ్మ కొలువై ఉన్న భరిణెలను చిలుకల గుట్ట నుంచి పూజారులు తీసుకొస్తుంటారు. ఆళ్లపల్లి నుంచి పగిడిద్దరాజు పగిడెలను ఆరం వంశీయులు తీసుకొస్తుంటారు. సమ్మక్క ఆగమనానికి ముందు పగిడిద రాజు పగిడెను ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత రోజు సమ్మక్క గద్దల మీదికి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ తరహా సంస్కృతి ఉండదు. సమ్మక్క ఆగమనానికి సంకేతంగా ప్రకృతి కూడా పరవశిస్తుంది. ఆకాశం ఒక్కసారిగా మేఘవృతం అవుతుంది.. అప్పటిదాకా ఉన్న చలి వాతావరణం కాస్త గంభీరంగా మారిపోతుంది.. అయితే ఇంతటి క్రతువులు నిర్వహించే ఆదివాసి పూజారులు ఎక్కడ కూడా తమ నిష్ట ను కోల్పోరు. పైగా నిత్యం సమ్మక్క నామస్మరణ చేస్తూ.. భక్తి పారవశ్యాన్ని ప్రదర్శిస్తుంటారు.

అయితే సమ్మక్క నామస్మరణతో నిత్యం ఉండే మేడారం పూజారులు వరుసగా కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరి వెనుక ఒకరు చనిపోతుండడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇటీవల సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య కన్నుమూశారు. ఆయన చనిపోయి కొద్ది రోజులు కూడా కాకముందే సారాలను పూజారి కాక సంపత్ కూడా మృతి చెందాడు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సంపత్.. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలు ఆస్పత్రులలో చికిత్స పొందినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.. ఇక ఇటీవల సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. వీరిద్దరి వయసు 50 ఏళ్ళు. అయితే అనారోగ్యంతో రోజుల వ్యవధిలోనే వీరిద్దరూ మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదం నెలకొంది.

“సంపత్, ముత్తయ్య నిత్యం సమ్మక్క -సారలమ్మ నామస్మరణతో ఉంటారు. పూజలు కూడా నిష్టగా చేస్తారు. జాతర సమయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. లక్షల మంది భక్తులు వచ్చినప్పటికీ ఏమాత్రం నిగ్రహాన్ని కోల్పోరు. అలాంటి వ్యక్తులు రోజుల వ్యవధిలో చనిపోవడం బాధాకరంగా ఉంది. సమ్మక్క – సారలమ్మ పూజలు అంటే ముత్తయ్య – సంపత్ మాత్రమే గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు వారు లేని లోటు కచ్చితంగా సమ్మక్క సారలమ్మకు చేసే పూజలపై పడుతుంది. అయితే వారి స్థానాలలో ఇతరులను నియమించాలా? అయితే ఎవరిని నియమిస్తారనేది ఆలయ కమిటీ నిర్ణయిస్తుందని” ఊరట్టం గ్రామస్తులు చెబుతున్నారు.. మరోవైపు వీరి మరణాల పట్ల గ్రామస్తులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన పూజారులు చనిపోవడం, ఇద్దరు కూడా అనారోగ్యానికి గురై చనిపోవడం తమను తీవ్రంగా కుంగదీస్తోందని గ్రామస్తులు అంటున్నారు. అయితే వీరి మరణానికి శాపం కారణమని విషయాన్ని కూడా కొట్టి పారేయలేమని వారు చెబుతున్నారు. గతంలో సమ్మక్క సారలమ్మ పూజారులు కూడా ఇలానే చనిపోయారని వారు గుర్తు చేస్తున్నారు. ఏదైనా శాపం వల్లే ఇలా జరుగుతోందని వారు అంటున్నారు.