What is Koppera in Tirumala: భారతదేశంలోని ఆలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.. వీటిలో తెలుగు రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి గురించి తెలిసిన విదేశీయులు తప్పకుండా సందర్శించడానికి ప్రయత్నిస్తారు. అలా విదేశాల నుంచి.. దేశంలోని భక్తుల తో తిరుమల ఆలయం ఎప్పటికీ కిటకిటలాడుతుంది. భక్తుల ప్రతి రోజు రోజుకు పెరుగుతుండడంతో స్వామివారి దర్శనం ఒక్కోసారి గగనంగా మారుతుంది. అయితే ఎంత కష్టమైనా శ్రీవారిని దర్శించుకుని తరించాలని అనుకుంటూ ఉంటారు. వెంకటేశ్వరుడిని దర్శించుకోవడమే కాకుండా ఏదైనా కానుక ఇవ్వాలని అనుకుంటారు. ఇలా ఎంతోమంది భక్తులు కానుకలతో వస్తూ ఉంటారు. తమకు తోచిన విధంగా సమర్పిస్తూ ఉంటారు. కొందరైతే నిలువు దోపిడీ చేస్తారు. ఇలాంటి వారి కోసం శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా హుండీలను ఏర్పాటు చేస్తారు. ఈ హుండీలను కొప్పెర అంటారు. మరి వీటికి ఈ పేరు ఎలా వచ్చింది? వీటి చరిత్ర ఏంటి?
సాధారణంగా కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉన్న లోహపు పాత్ర. పూర్వకాలంలో ఇది ఇళ్లల్లో కచ్చితంగా ఉండేది. కానీ శ్రీవారి ఆలయంలో ఉండే కొప్పెర ప్రత్యేకమైనది. తిరుమలకు భక్తులు రావడం వందల సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. అయితే మొదట్లో వచ్చిన భక్తులు తమకు తోచిన విధంగా నాణేలను సమర్పించుకునేవారు. ఇలా భక్తులు పెరిగిన కొద్దీ నాణేలు, వస్తువులు వేయడానికి ప్రత్యేకంగా పాత్రను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో కొప్పెర లాంటి ఒక పాత్రను ఏర్పాటు చేసి దానికి ఒక తెల్లటి గుడ్డను కట్టారు. అయితే మొదట్లో ఈ కొప్పెరలు చిన్నగా ఉండేవి. కానీ రాను రాను భక్తుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం పొడవైన పాత్ర కనిపిస్తుంది. ఇలాంటివి పదులకొద్ది ఉంటాయి. అయినా కూడా ఇవి సరిపోవు అంటే ఆశ్చర్యం వేయక మారదు. ఎందుకంటే తిరుమలకు వచ్చినా ప్రతి భక్తుడు ఎంతో కొంత స్వామివారికి కానుకలు ఇస్తారు. కొందరు తమ శరీరం మీద ఉన్న బంగారం శ్రీవారికి సమర్పిస్తారు.
అయితే ఈ కొప్పెరలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా కొందరు నియమించబడ్డారు. వీరు వంశపారంపర్యంగా విధులు నిర్వహిస్తున్నారు. మొదట్లో ఇక్కడ విధులు నిర్వహించేవారు ఒక ప్రాంతంలో నివసించేవారు. ఆ ప్రాంతం క్రమంగా గ్రామంగా ఏర్పడింది. ఇప్పుడు ఆ గ్రామాన్ని కొప్పెర వాండ్లపల్లి అని పిలుస్తున్నారు. తిరుమల నుంచి శ్రీనివాస మంగాపురం గ్రామానికి వెళ్లే దారిలో కొప్పెర వాండ్లపల్లి కనిపిస్తుంది. అయితే వీరు కేవలం హుండీలు మార్చడమే కాకుండా.. హుండీలో పడిన డబ్బులను కూడా లెక్కిస్తారు. శ్రీవారి హుండీలో డబ్బు, నగలు వేస్తారు. వీటిని వేరు చేసే పద్ధతిని పరాకమని అంటారు. శ్రీవారి ఉండిని ప్రతిరోజు రెండుసార్లు లెక్కిస్తారు. ఉదయం నిండిన ఉద్యోగులు రాత్రి లెక్కించగా… రాత్రి నిండిన ఉండిని ఉదయం ఉద్యోగులు లెక్కిస్తారు. శ్రీవారికి వచ్చిన ఆభరణాలు, వస్తువులు, డబ్బులను వేరు చేస్తారు. వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. ఒకవేళ ఇవి అత్యంత విలువైనవి అని అనుకుంటే శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు. డబ్బులు ఎప్పటిలాగే బ్యాంకులో జమ చేస్తారు.