YCP 2.0 Rappa Rappa Video: పుష్ప 2 ( Pushpa 2) సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. దానిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ డైలాగును యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి సైతం.. అందులో తప్పేం ఉందప్ప.. చంద్రబాబు అరాచక పాలన వారితో అలా చెప్పిస్తోంది అంటూ సమర్ధించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దారుణమైన డైలాగులు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఇలా అనేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నిచోట్ల ఈ డైలాగును వాడడం ప్రారంభించాయి. పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వాడేవారు. ఇప్పుడు మాత్రం ఓన్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే పుష్ప 2 రప్పా రప్పా అనే డైలాగులు తమ పేటెంట్ గా వాడుకుంటున్నారు.
ఆ సినిమా మాదిరిగా నరికేస్తామని..
ఆ సినిమాలో గంగమ్మ తల్లి( Gangamma Thalli ) జాతరలో తల నరికినట్లు.. వైసీపీ అధికారంలోకి వస్తే అలానే నరుకుతాం అంటూ హెచ్చరించేలా వైసిపి శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. దీనిపై ఎన్ని రకాల విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గడం లేదు. ఏదైనా సినిమా విడుదలయితే అందులోని డైలాగులు, పాటలు ప్రసిద్ధి చెందుతాయి. కానీ పుష్ప 2 చిత్రంలో ఈ డైలాగు మాత్రం వైసిపి కోసం అన్నట్లే ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ఈ డైలాగును వాడేస్తున్నారు. చివరకు వినాయక నిమజ్జనం లో కూడా విడిచిపెట్టలేదు.
వినాయకుడి విగ్రహం వెనుక..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ శ్రేణుల్లో కనీసం మార్పు రావడం లేదు. ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా.. 2029 ఎన్నికల్లో గెలిచి అందరి లెక్కలు తేల్చుతామన్నట్టు వ్యవహరిస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దన పాడులో వినాయక నిమజ్జనంలో అయితే విధ్వంసం సృష్టించారు. ఓ గణనాథుడి ప్రతిమ వెనుక భాగంలో 2.0.. రప్పా.. రప్పా వైయస్సార్ అని రాశారు. దాని కింద ఎరుపు రంగుతో గొడ్డలి గుర్తు వేశారు. అలా రాయడమే కాకుండా వినాయక విగ్రహాన్ని పైపైకి ఎగురవేస్తూ.. కేరింతలు కొట్టారు. మూడు రోజుల కిందట వినాయక నిమజ్జనంలో ఈ దృశ్యాలు వెలుగుచూశాయి. ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.