Vaikunta Ekadasi Upavasam: సాధారణంగా ప్రతి నెలలో వచ్చే ఏకాదశిని పర్వదినంగా భావిస్తారు. కానీ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి కి మిగతా వాటికంటే ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శ్రీమహావిష్ణువు ముల్లోకాలను సంచరిస్తారని పురాణాలు చెబుతుంటాయి. దీంతో మహావిష్ణువును స్మరించుకుంటే మూడు కోట్ల దేవతలను దర్శించుకున్నట్లేనని అంటుంటారు. అంతేకాకుండా ఈరోజు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడంతో ఈ దారి గుంట వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజున కేవలం ఉపవాసం మాత్రమే కాకుండా మరికొన్ని పనులు తప్పకుండా చేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పురాణాల ప్రకారం.. ముర అనే రాక్షసుడిని సంహరించిన సందర్భంగా ముక్కోటి ఏకాదశిని నిర్వహించుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా బియ్యంతో చేసిన ఎలాంటి పదార్థాలను తినకూడదని చెబుతుంటారు. ఎందుకంటే ముర అనే రాక్షసుడు బియ్యం లో దాక్కుంటాడు. అందువల్ల ఈరోజు బియ్యంతో చేసిన పదార్థాలను తినడం వల్ల మందబుద్ధి లభిస్తుందని చెబుతున్నారు. అందువల్ల ఈరోజు ఉపవాసం ఉండడం మాత్రమే కాకుండా వాటితో చేసిన ఎలాంటి పదార్థం తినకూడదని చెబుతుంటారు.
ఈరోజు నిరాహారంగా ఉండడం మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన పనులు కూడా చేయాలని పండితులు అంటున్నారు. ముక్కోటి ఏకాదశి రోజంతా ఉపవాసం గా ఉండాలి. అలాగే ఈరోజు అబద్ధం ఆడకూడదు. కొందరు ఉపవాసం ఉంటూనే అబద్ధం ఆడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వ్రత ఫలితం దక్కదని అంటున్నారు. అంతేకాకుండా ఈరోజు ఎలాంటి చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకుండా ఉండాలి. బ్రహ్మచారిగా ఉండాలి. రాత్రంతా జాగరణ చేయడం మంచిది. అన్నదానం చేయాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున భగవతారాధన ముగించుకొని పారాయణం చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చిన తర్వాతనే ఉపవాసం విరమించాలని చెబుతున్నారు.
అయితే ఆరోగ్య రీత్యా ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు వంటి పదార్థాలను తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు సాత్వికంగా ఇలాంటి ఆహారం తీసుకుంటూ విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం, గోసేవ వంటివి చేయాలి. అలాగే దానధర్మాలు చేయడం వల్ల స్వామివారి ఆశీస్సులను పొందవచ్చు. ఓం నమో నారాయణ అంటూ 108 సార్లు జపించడం వల్ల అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు.
శ్రీమహావిష్ణువు అంటే ఎక్కడో లేడని ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటాడని.. అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజు నారాయణ మంత్రం జపించడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటు సర్వపాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజంతా గడుపుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలి. ఇలా ఇలా కఠినంగా వ్రతం చేయడం వల్ల స్వామివారి ఆశీస్సులను పొందవచ్చని అంటున్నారు.