Ramadan 2025: ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్. అతి పెద్ద పండుగ కూడా రంజానే. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ప్రకారం, రంజాన్ ప్రారంభం నెలవంక (చంద్రుడు) కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. సౌదీలో చంద్రుడు కనిపించాక, భారతదేశంలో సాధారణంగా ఒక రోజు తేడాతో రంజాన్ మొదలవుతుంది, రంజాన్ మాసం ముగింపు కూడా ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం రంజాన్ మాసం ముగింపు దశకు చేరింది.
ముస్లింలు రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, కఠిన ఉపవాస దీక్షలు కొనసాగించారు. ప్రస్తుతం ఈమాసం ముగింపు దశకు వచ్చింది. తాజాగా సౌదీ అరేబియాలో మార్చి 29, 2025న చంద్రుడు కనిపించాడు. దీంతో అక్కడ మార్చి 30న ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోనున్నారు. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ప్రకారం, రంజాన్ ముగింపు ఈద్ ప్రారంభం చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటుంది. సౌదీలో చంద్రుడు కనిపించిన దాని బట్టి, అక్కడ ఆదివారం (మార్చి 30) ఈద్ సంబరాలు జరగనుండగా, ఉదయం 6:30 గంటలకు మసీద్ అల్ హరామ్‌లో ఈద్ ప్రార్థనలు నిర్వహించబడతాయి. దీని ప్రకారం, భారతదేశంలో సాధారణంగా ఒక రోజు తేడాతో ఈద్ జరుపుకుంటారు కాబట్టి, ఇక్కడ మార్చి 31, సోమవారం రంజాన్ పండుగ సంబరాలు జరుగుతాయి. దుబాయ్‌లో కూడా సౌదీని అనుసరించి మార్చి 30న ఈద్ జరుపుకోనున్నారు. ఈ విధంగా, రంజాన్ ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం తీరిపోయింది.
కేంద్రం కీలక నిర్ణయం..
రంజాన్ మాసం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ’సాగత్ ఈ మోదీ’ పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లిములకు పండగ కిట్లు అందించాలని నిర్ణయించింది. ఈ కిట్లలో స్త్రీ, పురుషులకు వస్త్రాలు, సేమియా, ఖర్జూరం, ఎండుద్రాక్ష, చక్కెర వంటి సామగ్రి ఉంటాయి. ఈ కిట్లు మార్చి 31న రంజాన్ రోజున అర్హులైన వారికి చేరేలా 32 వేల మంది బీజేపీ మైనార్టీ మోర్చా కార్యకర్తలు మసీదులతో సమన్వయం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. బీజేపీ మైనార్టీ వింగ్ జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దిఖీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సామరస్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
పవిత్రమైన పండుగ..
రంజాన్ పండుగ ముస్లిములకు అత్యంత పవిత్రమైన సమయం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రార్థనలు, విందులు, దానధర్మాలతో సంబరాలు జరుపుకుంటారు. సౌదీలో చంద్ర దర్శనంతో ఈద్ తేదీలు నిర్ణయించబడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు తమ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశంలోనూ ఈ సంబరాలు మార్చి 31న ఘనంగా జరగనున్నాయి.