Ramadan 2025
Ramadan 2025:ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లోని తొమ్మిదవ నెల అయిన రంజాన్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పాటించే పవిత్ర మాసం. ఈ నెలలో ముస్లింలు రోజంతా ఆహారం, పానీయాలకు దూరంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు.సెహ్రీ (తెల్లవారుజామున భోజనం)తో ప్రారంభమైన ఉపవాసంఇఫ్తార్ (సాయంత్రం భోజనం)తో ముగుస్తుంది.రంజాన్ అంటే ఆకలితో ఉండటమే కాదు. అల్లాహ్‌కు దగ్గరయ్యే సువర్ణావకాశం. రంజాన్ పండుగ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎదురు చూస్తున్నారు. ఉపవాసం, ప్రార్థనల కోసం అంకితం చేసిన పవిత్రమైన మాసంఇది. వందల ఏళ్లుగా ఉన్న ఈ సంప్రదాయం నెలవంక దర్శనంతో ప్రారంభం అవుతుంది. ఇది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
రంజాన్ లో ఉపవాసం చేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆత్మ నిగ్రహం, దానధర్మాలు చేయడం, సామాజిక అనుబంధాలను పెంచుకోవడం కూడా ఈ రంజాన్ మాసంలో భాగమే. కుటుంబాలు, స్నేహితులతో కలిసి ప్రతి రోజు తెల్లవారు జామున సెహ్రీ అనే భోజనాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి సూర్యాస్తమయం వరకు ఏమీ తీసుకోరు. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ తో ప్రతిరోజూ ఉపవాసాన్ని ముగిస్తారు. ఇఫ్తార్ ను కూడా ఎవరింట్లో వారు కాకుండా సమూహంగా కలిసి తింటారు.
రంజాన్ నెలలో ప్రతి రోజూ ఓ షెడ్యూల్ ప్రకారం అన్నీ జరుగుతాయి. ఉపవాసం, ప్రార్థనలు, ధ్యానం ఇలా ప్రతి రోజూ ఓ షెడ్యూల్ ద్వారా ముస్లింలకు మార్గనిర్దేశం జరుగుతుంది. రంజాన్ ను పాటిస్తున్న లక్షలాది మందికి ఈ షెడ్యూల్ పాటించడం తప్పని సరి కావడం వల్ల ఆధ్యాత్మిక క్రమశిక్షణ వస్తుంది. ఇది సెహ్రీ, ఇఫ్తార్‌ను సరైన సమయాల్లో పాటించేలా చూస్తుంది. వివిధ సంస్కృతులు, నేపథ్యాల నుండి వచ్చిన ముస్లింలంతా ఒకే ఆచారాన్ని పాటిస్తారు.
రంజాన్ మాసం ప్రారంభం అనేది నెలవంక కనిపించడంతో మొదలవుతుంది. ఈ ఏడాది సౌదీ అరేబియా, మధ్యప్రాచ్య దేశాలు, అలాగే అమెరికా, బ్రిటన్ లలో ఫిబ్రవరి 28 శుక్రవారం నాడు చంద్రుడిని చూశారు. ఆ సాయంత్రం చంద్రుడు కనిపిస్తే రంజాన్ అధికారికంగా మార్చి 1 శనివారం మొదలవుతుంది. ఆరోజు నుంచి ఉపవాసాలు ప్రారంభం అవుతాయి. చంద్రుడు కనిపించకపోతే మార్చి 2 ఆదివారం నుంచి ప్రారంభం అవుతాయి.
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ లాంటి దక్షిణాసియా దేశాలు మార్చి 1న అంటే శనివారం రంజాన్ చంద్రుని కోసం చూస్తాయి. కనిపిస్తే, ఉపవాసం మార్చి 2 ఆదివారం ప్రారంభమవుతుంది. లేకపోతే, అది మార్చి 3 సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. రంజాన్ మాసం ప్రారంభం అనేది దేశాల ప్రకారం మారుతుంది.