హైదరాబాద్ పరిసరాల్లో అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది. శేర్ లింగంపల్లి నియోజకవర్గంలోని పోచమ్మతల్లి విగ్రహం పాలు తాగడంతో భక్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో భక్తులు తరలి వస్తున్నారు. స్వయంభూ గా వెలిసిన అమ్మవారికి ఇక్కడ నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే తాజాగా అమ్మవారు పాలు తాగుతుందని తెలియడంతో భక్తులు పరవశించిపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
శేర్ లింగంపల్లి నియోజకవర్గంలోని మదీనా గూడా గ్రామంలో పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూ గా వెలిశారు. కొన్నేళ్లుగా ఇక్కడి అమ్మవారు భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నారు. బోనాల జాతర సందర్భంగా ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా పరవశించిపోతుంది. అమ్మవారు స్వయం భూ వెలియడంతో తమ కోరికలకు తీర్చుకోవడానికి చుట్టు పక్కల వారు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి అమ్మవారు పాలు తాగుతున్నారని ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీకి తెలపగా శుక్రవారం వారి సమక్షంలో ఒక చెంచాలో పాలు ఉంచి అమ్మవారికి తాగిపించారు. దీంతో పాలు తాగినట్లు గుర్తించడంతో ఈ విషయాన్ని బయటకు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ సర్క్యులేట్ కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.