Maha Shaivakhya Yoga: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా భావించే ‘మహా శైవాఖ్య యోగం’ నేడు ఏర్పడింది. కృష్ణ పక్ష చతుర్దశి తిథి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం ఒకేసారి కలవడం వల్ల ఈరోజును పరమ పవిత్రంగా భావించాలని పురోహితులు చెబుతున్నారు. శివారాధనకు అత్యంత శుభప్రదమైన ఈ యోగం 225 ఏళ్లలో కేవలం తొమ్మిదిసార్లు మాత్రమే సంభవిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. ఈ రోజు శివుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే వంద మహాశివరాత్రులు ఆచరించినంత పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. అయితే మహాశివుడిని ఈరోజు ఎలా పూజించాలంటే?
సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలాగే ఆరుద్ర నక్షత్రానికి కూడా శివునితో ప్రత్యేక సంబంధం ఉంది. కృష్ణ చతుర్దశి శివారాధనకు అత్యంత పవిత్రమైన తిథిగా పురాణాలు పేర్కొంటాయి. ఈ మూడు ఒకే రోజు రావడం అత్యంత అరుదైన యోగంగా భావించబడుతోంది. అందుకే ఈ రోజును ‘మహా శైవాఖ్య యోగం’గా పిలుస్తారు.ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేయడం.. ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించడం.. శివపార్వతులను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొన్నట్లు పురోహితులు చెబుతున్నారు. వంద మహాశివరాత్రులు ఆచరించినంత పుణ్యఫలం ఈ ఒక్క రోజు ఆరాధనతో లభిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లింగార్చనలు, బిల్వదళ పూజలు, పంచామృతాభిషేకాలు, మహామంగళహారతులు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనేక దేవాలయాల్లో శివనామ సంకీర్తనలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంగాజలం వంటి పవిత్ర ద్రవ్యాలతో శివలింగానికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శ్రేష్ఠమైన పూజగా భావిస్తారు. రుద్రం, చమకం పారాయణం మధ్య జరిగే అభిషేకం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా బిల్వదళాలతో చేసే పూజ శివునికి అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి.
మహా శైవాఖ్య యోగం రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. శివపంచాక్షరి మంత్రం ‘ఓం నమః శివాయ’ను 108 లేదా 1008 సార్లు జపించడం, శివపురాణం లేదా రుద్రాధ్యాయం పారాయణం చేయడం, దీపారాధన, ఉపవాసం, దానధర్మాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు.
ఈ పవిత్ర యోగంలో శివారాధన చేస్తే గ్రహదోషాలు తగ్గుతాయని, కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానాభివృద్ధి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పురోహితులు వివరిస్తున్నారు.
