Lord Shiva Sea Temple : మనదేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఇక జ్యోతిర్లింగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్షేత్రాలలో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ క్షేత్రాలలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది.. కాకపోతే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఒక విభిన్నమైన శైవ క్షేత్రం గురించి ప్రస్తావించబోతున్నాం.. ఇంతకీ దాని చరిత్ర ఎలా ఉందంటే..
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి రోజు మన దేశం మొత్తం ఆధ్యాత్మిక శోభ ఫరిడవిల్లుతూ ఉంటుంది. జ్యోతిర్లింగాలలో అద్భుతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మనదేశంలో శైవ క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ క్షేత్రాలలో శివుడు మనకు వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు. మనదేశంలోనే శివుడికి “నిష్కలంక మహాదేవ” పేరుతో ఒక ఆలయం ఉంది. ఇది సాదాసీదా ఆలయం కాదు. ఈ ఆలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. అన్నింటికీ మించి ఇక్కడ చోటుచేసుకునే వింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Also Read : మన దేశంలో అతి పెద్ద శివలింగం ఎక్కడ ఉందో తెలుసా? వరాలు కురిపించే శివయ్య ఇక్కడే ఉన్నాడట..
గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి కోలి యాక్ అనే గ్రామం ఉంటుంది.. ఈ గ్రామానికి దగ్గరలోనే అరేబియా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర తీరంలో నిష్కలంక మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉదయం అక్కడికి వెళ్తే గుడి కనిపించదు. కాకపోతే అక్కడ గుడి నిర్మించారు అని చెప్పడానికి ఒక ధ్వజస్తంభం మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నానికి సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆలయం పూర్తిగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్లడానికి మార్గం కూడా కనిపిస్తుంది. భక్తులు అక్కడికి వెళ్లి.. సముద్ర జలాలతో శివలింగానికి అభిషేకం చేసి.. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. రాత్రి పది గంటల దాకా ఆలయ సమీపంలోకి సముద్రం రాదు. రాత్రి 10 దాటిన తర్వాత సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఆలయాన్ని ముంచేస్తూ ఉంటుంది. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సముద్ర నీటిలోనే ఆలయం ఉంటుంది.. ఆలయం ఎదుట ఏర్పాటుచేసిన ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే ఆ ఎత్తు వరకు సముద్రపు నీళ్లు ముంచేస్తూ ఉంటాయి.. ఇప్పుడే కాదు కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఇలాంటి వింతే చోటు చేసుకుంటున్నది. ఈ క్షేత్రాన్ని పాండవులు నిర్మించాలని చారిత్రక పురాణాలు చెబుతున్నాయి.. ముఖ్యంగా పౌర్ణమి రోజు సముద్రం పోటు వేస్తుంది.. ఆ సందర్భంగా రాత్రి 10 గంటల తర్వాత సముద్రం విపరీతంగా ముందుకు వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి వెళుతుంది. ఈ దృశ్యాలను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో యాత్రికులు వస్తూ ఉంటారు. పాండవులు నిర్మించిన ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. అయితే ఇక్కడ శివలింగం విభిన్న ఆకారంలో కనిపిస్తుంది.. సముద్ర జలాలు ముంచేసినా.. సముద్రం పోటు వచ్చేసినా.. ఆలయం ఇంకా దృఢంగానే కనిపించడం విశేషం.