Khairatabad Ganesh 2024: వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. విశ్వనగరం హైదరాబాద్‌లో 11 రోజులు భక్తుల పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి బయల్దేరారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనంతోపాటు, నగరంలో వివిధ రూపాల్లో కొలువుదీనిన గణనాథులను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరోవైపు కోర్ట ఆదేశాల మేరకు నిమజ్జన కార్యక్రమం నిర్వహించేలా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిమజ్జనం తిలకించేందుకు భాగ్యనగర్‌వాసులతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా తిలకించారు.
7 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర..
గణపతి నిమజ్జనం సందర్భంగా ఆదివారం అర్ధరాత్రే ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనాలు నిలిపవేశారు. సోమవారం మొత్తం వెల్డింగ్ పనులు నిర్వహించారు. సాయంత్రం వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి గణనాతుని తరలింపు పనులు మొదలయ్యాయి. భారీ క్రేన్ల సహాయంతో 70 అడుగుల బడా గణేశ్ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపైకి తీసుకువచ్చి.. వెల్డింగ్ చేయించారు. అనంతరం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. యాత్ర పొడవునా భక్తుల నృత్యాలు, భక్తిగీతాలాపనలుతో మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఒంటి గంటకు హుస్సేన్‌సాగర్ వద్ద ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ వద్దకు చేరుకున్నాడు మహా గణనాథుడు.
జయజయ ధ్వానాల మధ్య నిమజ్జనం..
ఇక అక్కడ మరోమారు వెల్డింగ్ పనులు నిర్వహించారు. బడా గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేకంగా తెప్పించిన సూపర్ క్రేన్‌కు గణనాథుడిని బిగించి వాహనంపై చేసిన వెల్డింగ్‌లను తొలగించారు. తర్వాత చివరి పూజ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1:30 నుంచి 1:40 మధ్య బడా గణేశ్ నిమజ్జనం లక్షల మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య నిర్వహించారు. దీంతో గౌరీ పుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు.
జనసంద్రమైన ట్యాంక్‌బండ్..
ఇదిలా ఉంటే.. వినాయక నిమజ్జనం తిలకించేందు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంగ్‌బండ్ పూర్తిగా జనసంద్రంగా మారింది. ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సచివాలయం, ఐ మ్యాక్స్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 25 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.