Keshineni Nani: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలోకి మాజీ ఎంపీ కేశినేని నాని రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిందా? తిరిగి పార్టీలో యాక్టివ్ కావాలని సూచించారా? మంచి ముహూర్తం చూసి కేశినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కేశినేని నాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అదే పార్టీకి నాని గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇకనుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధాలు ఉండవని తేల్చి చెప్పారు నాని. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేసినేని నాని ని తిరిగి పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం విజయం.. బీజేపీకి షాక్
* వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి..
2014 ఎన్నికలకు ముందు కేశినేని కుటుంబం( Kesineni family ) టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ కుటుంబానికి వ్యాపార పరంగా మంచి గుర్తింపు ఉండేది. గతంలో కేశినేని ట్రావెల్స్ పేరిట ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నడిపించేవారు. జెసి దివాకర్ రెడ్డి దివాకర్ ట్రావెల్స్ పేరిట బస్సులను తిప్పేవారు. అప్పట్లో కేశినేని, దివాకర్ ట్రావెల్స్ ఎంతో ఫేమస్. అయితే తొలిసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించారు. 2019లో సైతం రెండోసారి బరిలో దిగారు కేశినేని నాని. జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకొని నిలబడ్డారు. ఎంపీగా విజయం సాధించారు. అటు తరువాతనే నానీలో ఒక రకమైన మార్పు వచ్చింది. పార్టీ హై కమాండ్ తీరుపై అసంతృప్తి ప్రారంభం అయింది. అయితే నాయకత్వం పార్టీలో తన ప్రత్యర్థులను ప్రోత్సాహం అందించడం కేశినేని నానికి మింగుడు పడలేదు. పైగా తనపై తన తమ్ముడు చిన్నిని ప్రయోగిస్తున్నారన్న ఆహ్వానంతోనే ఆయన టిడిపి నుంచి బయటకు వెళ్లిపోయారు.
* హ్యాట్రిక్ ఎంపీ ఖాయం..
వాస్తవానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే విజయవాడ ఎంపీగా మూడోసారి పదవి చేపట్టేవారు కేసినేని నాని( Kesineni Nani ). అయితే పార్టీలో తన ప్రత్యర్థులతో చేతులు కలిపిన సోదరుడు చిన్ని.. తన రాజకీయ జీవితానికి అడ్డంకిగా నిలిచారన్న ఆగ్రహం కేశినేని నాని లో ఉంది. ఆపై టిడిపిని అనవసరంగా విడిచి పెట్టాను అన్న బాధ కూడా ఉంది. ఇప్పుడు ఆ బాధతోనే మాట్లాడుతున్నారు నాని. టిడిపి అధినాయకత్వం కంటే తన ఈ పరిస్థితికి కారణమైన ప్రత్యర్థులపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. అందులో భాగంగా విశాఖలో ఐటీ సంస్థకు భూ కేటాయింపులపై మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు జన్మదినం నాడు శుభాకాంక్షలు చెబుతూ.. నాని పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. తద్వారా నాయకత్వంతో తనకు ఎటువంటి ఇబ్బందులు లేవని కేశినేని నాని సంకేతాలు ఇచ్చారు.
* ఆ సామాజిక వర్గ నేత కావడంతో..
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) దృష్టి కేసినేని నాని పై పడినట్లు తెలుస్తోంది. నాని రూపంలో బలమైన నేత ఉంటే కమ్మ సామాజిక వర్గం పై పట్టు సాధించవచ్చని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ మోహన్ జైల్లో ఉన్నారు. మాజీమంత్రి కొడాలి నాని అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి సమయంలో దూకుడు కలిగిన కేసినేని నాని లాంటి నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రయోజనం అని భావిస్తున్నారు. అయితే రాజకీయాల పట్ల విముఖతగా ఉన్న కేశినేని నాని ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!