Nalgonda: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తిరుమల లోనే నిత్య పూజలు జరుగుతుంటాయి.. తిరుమలలో స్వామివారికి పూజలు.. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చేయరు. కేవలం స్వామి వారు వెలసిన తిరుమలలో మాత్రమే పూజాధికాలు నిర్వహిస్తుంటారు.. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం పూర్తి విభిన్నం.. ఎందుకంటే ఇక్కడ నారాయణుడి అవతారాలలో ప్రముఖమైన సీతారామచంద్రస్వామికి జరిగే పూజలు పూర్తి విచిత్రం.. ఎందుకంటే..
తెలంగాణలోని నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో సీతారామచంద్రస్వామి కొలువై ఉన్నారు.. స్వామివారికి ఘనమైన ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతుంటాయి.. శ్రీరామనవమి నాడు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమికి 15 రోజుల ముందే ఆ ఊర్లో సందడి మొదలవుతుంది. ఆలయాన్ని రంగులతో తీర్చి దిద్దుతారు. మామిడి తోరణాలు అలంకరించి శోభాయమానంగా రూపొందిస్తారు. ఆ తర్వాత స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అన్నదానం కూడా చేపడతారు. అయితే ఇవన్నీ కూడా చందుపట్ల గ్రామంలో జరగవు. అదేంటి రాముడు కొలువైంది అదే గ్రామంలో కదా.. మరి ఈ వేడుకలు వేరే గ్రామంలో చేయడం ఏంటి అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అయింది కదా.. ఆగండి ఆగండి అక్కడిదాకే వస్తున్నాం. చందుపట్ల సీతారామచంద్ర ఆలయం ఉన్నప్పటికీ.. స్వామివారి కల్యాణ మహోత్సవం.. బ్రహ్మోత్సవం వంటి కార్యక్రమాలు పక్కనే ఉన్న బండెపాలెం అనే గ్రామంలో నిర్వహిస్తారు. ఇది కేతిపల్లి అనే మండలంలో ఉంది.
రెండూళ్ల రామయ్య
బండేపాలెం, చందుపట్ల గ్రామాలలో వెలసిన సీతారామచంద్రస్వామిని రెండు గ్రామాల రామయ్య గా పిలుస్తారు.. అయితే బండపాలెం గ్రామంలో అభయారణ్యం ఉంటుంది. ఇక్కడ సీతారామచంద్రస్వామి స్వయంభుగా వెలిశారు. అక్కడ పూజలు జరపడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్లే స్వామివారికి పక్కనే ఉన్న చందుపట్ల గ్రామంలో ఆలయం నిర్మించారు. ప్రతిరోజు ఆలయంలో పూజలు జరుపుతున్నప్పటికీ.. శ్రీరామనవమి.. బ్రహ్మోత్సవాలు బండపాలెం గ్రామంలో నిర్వహిస్తారు.. బండపాలెం, చందుపట్లకు కేవలం 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడం వల్ల శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలకు ఇరు గ్రామాల ప్రజలు హాజరవుతారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య వెనకటి కాలం నుంచే బంధుత్వం ఉండడంతో పెద్దగా ఇబ్బందులు ఈదురు కావడం లేదు. పైగా ఇక్కడ పూర్తి గ్రామీణ వాతావరణం ఉంటుంది కాబట్టి శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అన్నదానం.. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఆకాశమేహద్దుగా నిర్వహిస్తుంటారు. భక్తులు వేలాదిగా హాజరవుతారు.. కోలాటాలు.. భజనలు కూడా అద్భుతంగా జరుపుతుంటారు. శ్రీరామనవమి సందర్భంగా రెండు గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ జరిగే శ్రీరామనవమిని చూడడానికి నకిరేకల్లోని వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తారంటే అతిశయోక్తి కాదు. ఎంతో చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి దేవాదాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.